జగిత్యాల, మార్చి 15 : ఆస్తికోసం కన్న తండ్రినే కత్తితో పొడిచి.. పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన ఘటన జగిత్యాల రూరల్ మండలం పొలాసలో సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొలాసకు చెందిన పడాల కమలాకర్(60) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన లలిత, జమున అనే ఇద్దరు అకాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య జమునకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉండగా, కూతురుకు వివాహం జరిగింది. రెండో భార్యకు పిల్లలు లేరు. కమలాకర్ ఐదు నెలల క్రితం కర్నాటక రాష్ట్రం బీదర్ నుంచి మరో మహిళను మూడో పెళ్లి చేసుకుని అదే గ్రామంలోనే వేరే ఇంటిలో నివాసం ఉంటున్నాడు. మూడో భార్యకు పిల్లలు పుడితే ఆస్తి పోతుందని మొదటి భార్య పిల్లలు, కమలాకర్‌కు గొడవలు జరుతున్నాయి. ఈ క్రమంలో శనివారం కొడుకులు రంజిత్, చిరంజీవి, కూతురు శిరీష, అల్లుడు శోభన్‌బాబు కలిసి కమలాకర్ ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశారు. తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. స్థానికులు జగిత్యాల ప్రభుత్వ దవాఖనకకు తరలించగా పరిస్థితి విషమించి కమలాకర్ మృతి చెందాడు. నిందితులు రూరల్ స్టేషన్లో లొంగిపోయినట్టు సమాచారం. మృతుడి తమ్ముడు రవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్ఐ సదాకర్ తెలిపారు.