తిమ్మాపూర్, ఆగస్టు 26: కొడుకులకు కన్నతల్లి భారమైంది. మొన్నటిదాకా వంతుల వారీగా పోషించి, కొద్దిరోజులుగా పట్టించుకోకపోవడంతో ఆ తల్లి ఠాణా మెట్లెక్కి తన గోడువెళ్లబోసుకోవడం, పోలీసులు వెళ్లి మాట్లాడినా వారి తీరు మారలేదు. ఈ ఘటన అలుగునూర్ గ్రామంలో చోటుచేసుకున్నది. అల్గునూర్కు చెందిన వేముల నర్సవ్వకు నలుగురు కొడుకులు, ముగ్గురు బిడ్డలు. అందులో ఓ కొడుకు, కూతురు కొన్నేండ్ల క్రితం మరణించారు. ఆమె భర్త ఇటీవలే మృతిచెందారు. అప్పటి నుంచి గ్రామంలో ఉంటున్న కొడుకులే 15 రోజులకొకరు వంతుల వారీగా పోషిస్తున్నారు. కొద్దిరోజులుగా కొడుకులు తల్లి పోషణను మరిచారు.
చిన్న కొడుకు వద్దే మూడునెలలపాటు ఉండి ఒకే కొడుకుకు భారం కాదల్చుకోలేక అల్గునూర్లోనే కిరాయి ఇంట్లో నివాసం ఉంటున్న బిడ్డ ఇంటికి వెళ్లింది. మిగితా కొడుకుల తీరుమారకపోవడంతో ఆదివారం ఆమె ఎల్ఎండీ ఠాణా మెట్లెక్కింది. పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చినా వారిలో మార్పు రాలేదు. విషయం తెలుసుకున్న మహిళా, శిశు, వికలాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ అధికారులు శ్రీనివాస్, రఫీయొద్దీన్ సోమవారం నర్సవ్వ వద్దకు వెళ్లి వివరాలు తీసుకున్నారు. కాగా, మంగళవారం నర్సవ్వ కొడుకులను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తానని ఎస్సై చేరాలు తెలిపారు. తల్లికి బువ్వ పెట్టలేని కొడుకుల విషయం సోషల్మీడియాలో వైరల్ అవుతుండగా, చివరి ఘడియల్లో ఇలాంటి కష్టం ఎవరికీ రావద్దని నెటిజన్లు సైతం ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.