సుల్తానాబాద్, నవంబర్ 11: ఆస్తి తగాదాలో తండ్రిని చంపి పోలీస్‌స్టేషన్‌కు చేరిన కొడుకు.. సోమవారం పోలీసుల అనుమతితో తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని యాదవనగర్‌కు చెందిన తొట్ల మధునయ్య, కొడుకు తొట్ల తిరుపతి మధ్య ఆస్తి కోసం తలెత్తింది. ఈ ఘర్షణలో మధునయ్య మృతిచెందగా.. కొడుకు పోలీసుల అదుపులో విచారణలో ఉన్నాడు. తండ్రి అంత్యక్రియల కోసం పలువురు పెద్దల విజ్ఞప్తి మేరకు పోలీసులు మానవతా దృక్ఫథంతో కొడుకుకు అనుమతినాచ్చారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తిరుపతిని అంత్యక్రియలు జరిగే ప్రదేశానికి తీసుకెళ్లి కార్యక్రమం జరిగిన వెంటనే తిరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తాగిన మైకంలో జరిగిన ఘటనను తలుచుకుని తిరుపతి తండ్రి కాళ్లపై పడి రోదించిన తీరు పలువురిని కలచివేసింది. విచారణ అనంతరం తిరుపతిని జిల్లా జైలుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు. అంత్యక్రియల సమయంలో సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై శ్రావణ్‌కుమార్, పోలీస్ సిబ్బం ది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
కూతురు కడచూపునకు నోచుకోని తండ్రి ; ఓ కేసులో జగ్దల్పూర్ జైలుకు తరలింపు
సారంగాపూర్, నవంబర్ 11: ఓ కేసులో జైలుకు వెళ్లిన తండ్రి.. కన్నకూతురు అంత్యక్రియలకు కూడా నోచుకోలేకపోయాడు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లికి చెందిన పోగుల రాజేశం కూతురు పోగుల లత (23) అనుమానాస్పద స్థితిలో నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం రేవోజీపేటలో మృతి చెందింది. మృతురాలి తండ్రి రాజేశంను ఓ కేసులో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేయగా.. ప్రస్తుతం జగ్దల్పూర్ జైలులో ఉన్నాడు. కూతురును కడసారి చూసేందుకు ఆమె మృతదేహాన్ని రేచపల్లిలోనే ఫ్రీజర్‌లో భద్రపర్చారు. జైలులో ఉన్న రాజేశం విడుదల కోసం మృతురాలి తల్లి మల్లీశ్వరి, పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాధవకుమార స్వామి, తెలంగాణ జనజాగృతి జగిత్యాల జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి సోమవారం జగ్దల్పూర్ కోర్టుకు వెళ్లి బెయిల్ పిటిషన్ వేశారు. కానీ.. అక్కడి ఎన్ఐఏ కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. దీంతో మంగళవారం లత అంత్యక్రియలు జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లత మృతిపై పలు అనుమానాలు ఉండటంతో రీపోస్టుమార్టం చేసేందుకు వీలుగా ఆమె మృతదేహాన్ని ఖననం చేయనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.