సంగెం, జూన్ 28 : వడ్డీ డబ్బుల కోసం నిద్రిస్తున్న తల్లిపై ఓ కొడుకు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లిలో చోటుచేసుకున్నది. 80 శాతం కాలిన గాయాలతో దవాఖానలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కుంటపల్లికి చెందిన ముత్తినేని వినోద, సాంబయ్యకు కుమార్తె స్వరూప, కుమారుడు సతీశ్ ఉన్నారు. సాంబయ్యకు ఉన్న మూడెకరాల భూమిని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌కు ఇచ్చాడు. పరిహారంగా వచ్చిన డబ్బుల్లో సతీశ్‌కు ఇవ్వగా మిగిలిన రూ.6 లక్షలను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. వడ్డీని కూడా తనకే ఇవ్వాలని సతీశ్ కొంతకాలంగా గొడవ చేస్తున్నాడు.
గత ఏప్రిల్ నెల 1న ఇంట్లో నుంచి వెళ్లిన సతీశ్ గీసుగొండ మండలం గంగదేవిపల్లిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున కుంటపల్లిలోని తన ఇంటికి వచ్చాడు. నిద్రిస్తున్న తల్లి వినోదపై పెట్రోల్ పోయగా గమనించి కేకలు వేసింది. తండ్రి సాంబయ్య లేచి సతీశ్‌ను అడ్డుకునేందుందుకు యత్నించగా నెట్టేశాడు. అగ్గిపుల్ల గీసి ‘నువ్వు చస్తేనే భూమి, పైసలు వస్తాయని’ చెబుతూ గోడదూకి పరాడయ్యాడు. బాధితురాలిని 108 వాహనంలో వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నరేశ్ తెలిపారు.