హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కొందరు పోలీసులు అదుపు తప్పుతున్నారు. పోలీస్ బాస్ మాటలు సైతం పెడచెవిన పెడుతూ అడ్డగోలుగా సివిల్ తగాదాల్లో తలదూర్చుతున్నారు. ఉత్తపుణ్యానికి అమాయకులను చితకబాదుతున్నారు. రియల్ ఎస్టేట్ దందాలు చేస్తూ.. పోలీస్స్టేషన్లలోనే సెటిల్మెంట్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కిందిస్థాయి కానిస్టేబుళ్ల నుంచి.. ఉన్నతస్థాయి డీఎస్పీ, డీసీపీ ర్యాంకు వరకూ విమర్శలనెదుర్కొంటున్నారు. ఇటువంటి ఖాకీల ఆగడాలపై ఫిర్యాదు చేస్తే పట్టించుకునే దిక్కులేదు. ఈ ఏడాది ఏప్రిల్ 14న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయి నుంచి రీజియన్ల వరకు పోలీసు కంప్లెయింట్స్ అథారిటీకి చైర్మన్‌ను, చైర్పర్సన్లను, సభ్యులను నియమించిన సంగతి తెలిసిందే.
రెండు నెలలైనా ఆఫీసు లేదు..
ప్రభుత్వం పోలీసు కంప్లెయింట్స్ అథారిటీలను ప్రకటించి రెండు నెలలు ముగిసినా నేటికీ వారికి ఒక ఆఫీసును కేటాయించలేదు. ఫర్నిచర్, నిర్వహణ వంటివాటి ఊసే లేదు. రెండున్నర నెలలవుతున్నా నేటికీ సరైన స్ట్రక్చర్, ఓ కార్యాచరణ లేక సభ్యులు సైతం ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది. దీంతో పోలీసు కంప్లెయింట్స్ అథారిటీకి ఎక్కడ ఫిర్యాదు చెయ్యాలో తెలియక ఇబ్బందులు పడుతున్నట్టు పలువురు బాధితులు ‘నమస్తే తెలంగాణ’ దృష్టికి తీసుకొచ్చారు. ఖమ్మం, నిజామాబాద్, మంచిర్యాల, నల్లగొండకు చెందిన బాధితులు కొందరు పోలీసుల ఆగడాలపై కంప్లెయింట్స్ అథారిటీకి ఫిర్యాదు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. కొందరు అక్రమార్కులైన పోలీసుల ఆగడాలు రోజురోజుకూ పెరుగుతుండగా.. పోలీసు కంప్లెయింట్స్ అథారిటికి నేటికీ కనీసం ఒక భవనం, ఆఫీసు, ఇతర సదుపాయాలు లేవని తెలిసి బాధితులు ఉసూరుమంటూ తిరిగి వెళ్లిపోతున్నారు. స్టేషన్‌కు వచ్చేవారి పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, బాధితుల పక్షానే నిలబడాలని, ప్రజలకు సేవ చేసి, మంచి పేరు తెచ్చుకోవాలని, సివిల్ కేసుల్లో, వివాహేతర బంధాల్లో తలదూర్చొద్దని డీజీపీ పదేపదే చెప్తున్నారు. అన్ని జిల్లాల ఎస్హెచ్ఓలను పిలిచి మాట్లాడారు కూడా. అయినా కొందరు సిబ్బంది ప్రవర్తనలో ఎలాంటి మార్పు రావడం లేదు.