హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర పన్నిన నిందితులు రెండు గ్యాంగులుగా విడిపోయి, తమ పథకం అమలుకు యత్నించినట్టు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఒక గ్యాంగ్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను, మరో గ్యాంగ్ ఆయన అనుచరుడు హైదర్‌అలీని హతమార్చేలా పక్కా స్కెచ్ వేసుకొని రెండు గ్రూపులుగా విడిపోయారు. మంత్రిని హత్య చేసేందుకు బయలుదేరిన గ్యాంగ్ ఢిల్లీకి వెళ్లే ముందు తమ వద్ద ఉన్న తుపాకులను బహూదుర్పల్లి ఆటవీప్రాంతంలోని పొదల్లో దాచిపెట్టింది. నిందితుల విచారణలో ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు.. అటవీప్రాంతంలో దాచిపెట్టిన 9 ఎంఎం క్యాలిబర్ తపంచ, లైవ్‌రౌండ్లు, 325 కంట్రీ మేడ్ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకొన్నారు. పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఇలాంటి అనేక ఆసక్తికర అంశాలున్నాయి. హత్యలకు గత ఆగస్టులోనే స్కెచ్ వేసినట్టు తెలిసింది.
రిమాండ్ రిపోర్టులోని కొన్ని ప్రధానాంశాలు
మహబూబ్‌నగర్‌లో రాజకీయంతో పాటు బారు, రియల్ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్న సీహెచ్ రాఘవేంద్రరాజు, అతని సోదరులు నాగరాజు, మధుసూదన్‌రాజు, అమరేందర్‌రాజు చాలాకాలంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు గులాం హైదర్ అలీపై కోపం పెంచుకొన్నారు. వీరిద్దరినీ హత్య చేయాలని నిర్ణయించుకొన్నారు. ఈ విషయాన్ని తమతో సన్నిహితంగా ఉండే దండేకర్ విశ్వనాథరావు, వరడ యాదయ్య, మున్నూరు రవితో చర్చించారు. భారీ సుపారీ ఇచ్చేందుకు ఏర్పాట్లుచేసుకొన్నారు. ఆయుధాల సేకరణ, హత్య కుట్ర అమలుకు అవసరమైన సహకారం కోసం నేరచరిత్ర ఉన్న మహ్మద్ ఫారూఖ్ అహ్మద్‌ను ఆశ్రయించారు.
గత ఏడాది నవంబర్ 18న మహబూబ్‌నగర్ ఎక్సైజ్ కోర్టులో ఫారూఖ్‌ను కలిశారు. మంత్రితో పాటు హైదర్‌ను హతమార్చేందుకు ఆయుధాలు కావాలని, హత్యకుట్రలో సహాయం చేయాలని కోరారు. ఫారూఖ్, హైదర్అలీలు స్నేహితులనే విషయం కుట్రదారులకు తెలియదు.
నిందితులు ఫారూఖ్‌కు ఫోన్ చేసి ఆయుధాలకు డబ్బులు ఇస్తామంటూ ఒత్తిడిచేశారు. దీంతో కుట్ర విషయాన్ని హైదర్‌కు చెప్పాడు. తనను కొంతకాలం దాచి పెట్టాలని ఫారూఖ్‌ను హైదర్ కోరాడు.
సుచిత్ర ప్రాంతంలో ఎస్వీఎస్ లాడ్జీలో గత నెల 23న వీరిద్దరు బస చేశారు. రాఘవేంద్రరాజు సోదరులు వారికోసం వెతికారు. సుచిత్రలోని లాడ్జీలో ఉన్నట్టు రాఘవేంద్రరాజు గుర్తించాడు.
హైదర్‌ను హత్య చేసే బాధ్యతను తన సోదరుడు నాగరాజుతో పాటు విశ్వనాథరావు, యాదయ్యకు అప్పగించాడు.
రాఘవేంద్రరాజు, మున్నూరు రవితో పాటు మిగతా ఇద్దరు సోదరులు మంత్రిని హత్య చేసే గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. ఢిల్లీకి వెళ్లే ముందు ఆయుధాలు తెచ్చి వాటిని అటవీ ప్రాంతంలోని పొదల్లో దాచిపెట్టారు.
హైదర్‌ను హత్య చేసేందుకు గత నెల 25న నాగరాజు, విశ్వనాథరావు, యాదయ్య సుచిత్ర లాడ్జీ దగ్గరకు వెళ్లారు. మధ్యాహ్నం హైదర్అలీ, ఫారూఖ్ కలిసి లాడ్జీ నుంచి బయటకు రాగానే కత్తులతో వెంబడించారు. హైదర్, ఫారూఖ్ వెం టనే పేట్‌బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఆ ముగ్గురిని అరెస్టు చేశారు.
ఈ ముగ్గురిని విచారించగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు ప్రణాళిక వేసిన గ్యాంగ్ ఢిల్లీలో ఉన్నదనే విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఢిల్లీకి వెళ్లి అక్కడి సౌత్ ఎవెన్యూ పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇచ్చి రాఘవేంద్రరాజు, మున్నూరు రవి, మధుసూదన్‌రాజు, అమరేందర్‌రాజు, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి డ్రైవర్ తిలక్పాను ఈ నెల 2న అరెస్టు చేశారు.
రెండోరోజూ ఉద్యోగుల నిరసనలు
ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ హత్యకుట్రకు కుట్రచేసినవారిని కఠినంగా శిక్షించాలంటూ రెండోరోజు కూడా నిరసనలు కొనసాగాయి. ఉద్యోగసంఘాల జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగులు శుక్రవారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. హైదరాబాద్ ఈసీఐఎల్‌లోని ఎక్సైజ్ కార్యాలయంలో టీజీవో నేతలు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో టీజీవో ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, నాయకులు రవీందర్‌కుమార్, రవీందర్రావు, అరుణ్‌కుమార్, ఎంబీ కృష్ణాయాదవ్, డేవిడ్, హత్య కుట్రను ఖండిస్తున్నట్టు టీజీవో హైదరాబాద్ నగరశాఖ అధ్యక్షుడు జీ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
– హైదరాబాద్, నమస్తే తెలంగాణ