విద్యానగర్‌కు చెందిన అజయ్ (పేరు మార్చాం) 2016లో ఒక బ్యాంకు ఖాతా తెరిచాడు. ఆ బ్యాంకు అధికారులు ఖాతాతో పాటే క్రెడిట్ కార్డును కట్టబెట్టారు. తనకు వద్దని, ఎందుకిచ్చారని అడిగితే.. ఎప్పుడైనా అవసరమొస్తుంది, మీరు వాడితేనే చార్జీలు పడతాయి, లేకపోతే లేదు అని చెప్పారు. సరే పోనీ అనుకొని ఆ కార్డును ఇంట్లో ఓ మూలన పడేశాడు. తీరా నెల గడిచాక రూ.500 కట్టాలని ఫోన్‌కు మెసేజ్.. ఇంటికి బిల్లు.. బ్యాంకు నుంచి ఫోన్ల మీద ఫోన్లు. ఏమిటి ఇదంతా! అని అడిగితే.. మీ క్రెడిట్ కార్డు సర్వీస్ చార్జీ అని, గడువులోగా కట్టకపోతే వడ్డీ కూడా పడుతుందని చెప్పటంతో ముఖం తెల్లబోయింది. తానెందుకు కడతానని సైలెంట్‌గా ఉండిపోయాడు. తెల్లారే దానికి వడ్డీ పడింది. ఇదేంటని బ్యాంకుకు వెళ్లి నిలదీస్తే హెడాఫీస్ది అని, తమ చేతిలో ఏం లేదని బదులిచ్చారు.
ఇంతలో బిల్లు రూ.7 వేలు చెల్లించాలని మరోసారి ఫోన్ వచ్చింది. అదేమని అడగ్గా, రూ.2 వేలు బ్యాంకుకు సంబంధించినవి, మిగతావి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీది, మీ కార్డుకు ఇన్సూరెన్స్ డబ్బు చెల్లించాలని చెప్పటంతో అజయ్ కంగుతిన్నాడు. బ్యాంకు అధికారులను నిలదీస్తే, తామేమీ చేయలేమని చెప్పటంతో, అంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదు చేశాడు. బ్యాంకు వాళ్లతోనే తేల్చుకోవాలని అంబుడ్స్‌మెన్ నుంచి రిైప్లె. ఇంతలో అజయ్‌కి అవసరముండి వేరే లోన్ కోసం బ్యాంకుకు వెళ్లగా సిబిల్ రిపోర్టు లేదు, మీరు బకాయిదారుడిగా ముద్రపడిందంటూ ఆ బ్యాంకు అధికారులు చెప్పారు. తనకు సంబంధం లేకుండా కార్డును జారీ చేయడమే కాకుండా, తన సిబిల్ రిపోర్టుపై ప్రభావం చూపే విధంగా వ్యవహరించిన బ్యాంకుపై తాను న్యాయపోరాటం చేస్తానంటూ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాడు.
Credit Card | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): వద్దన్నా క్రెడిట్ కార్డు.. దాని ఫీజు.. ఇన్సూరెన్స్ స్కీమ్‌లతో కొన్ని బ్యాంకులు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. బాధను చెప్పుకోవడానికి బ్యాంకుకు వెళ్తే తమకేం సంబంధం లేదంటారు. అంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదు చేస్తే బ్యాంకులోనే తేల్చుకోండంటూ చేతులు దులుపేసుకుంటారు. తమ టార్గెట్లను పూర్తి చేసుకోవటం కోసం మాయమాటలు చెప్తూ ఆయా బ్యాంకుల ప్రతినిధులు క్రెడిట్ కార్డులు కట్టబెడుతూ అమాయకులను బలిచేస్తున్నారు. బ్యాంకులో ఖాతా ఉంటే చాలు.. క్రెడిట్ కార్డు ఉన్నదా? పాలసీ ఉన్నదా? చిన్న పాలసీ తీసుకోండి.. మ్యూచ్యువల్స్ ఫండ్స్‌లో డిపాజిట్ చేయండి అంటూ ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్లు చెప్పినట్టు విని సరే అంటే మర్యాద. లేకపోతే పట్టించుకొనేవారే ఉండరు. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నా, ఆర్బీఐ నుంచి సరైన స్పందన లేకపోవటం గమనార్హం.
కస్టమర్ అనుమతి లేకుండా క్రెడిట్ కార్డు జారీ చేసేందుకు బ్యాంకులకు అవకాశం లేదని ఆర్బీఐ చెప్తున్నది. కానీ, నిబంధనలు ఎవరూ పట్టించుకోవడం లేదు. క్రెడిట్ కార్డులను విక్రయించేందుకు ఆయా బ్యాంకులకు టార్గెట్లు ఉంటాయి. ఆ టార్గెట్లు పూర్తి చేసుకోవటంతో పాటు ఎగ్జిక్యూటివ్‌కు కమీషన్లు ఆఫర్ చేయటంలో ఎక్కడ పడితే అక్కడ క్రెడిట్‌కార్డులు విక్రయించే వాళ్లు కనిపిస్తుంటారు. షాపింగ్ మాల్స్‌లో కస్టమర్ రాగానే ‘సర్! మీకు క్రెడిట్ కార్డు కావాలా?’ అంటూ అడిగేవారు చాలామంది ఉంటారు. క్రెడిట్ కార్డులు అమ్మడం వరకే ఫ్రంట్ ఆఫీస్ సిబ్బంది పనిచేస్తుంటారు. ఆ తర్వాత అంతా బ్యాక్ ఎండ్ నుంచే నడుస్తుంది. ఖాతాదారుడి సేవల కోసం బ్యాంకుల వద్దకు పరుగులు తీస్తే సమాధానం ఇచ్చేవారుండరు. ఆయా బ్యాంకుల క్రెడిట్ కార్డు కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తే ఫోన్ కలవదు. కలిసినా సరిగా సమాధానం ఉండదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ బిల్లు మాత్రం కచ్చితంగా వస్తుంది. ఈ కార్పొరేట్ వ్యవస్థలో తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక, చచ్చినట్టు వాడకున్నా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లిస్తున్నాడు.
క్రెడిట్ ఇవ్వడం నుంచి ఖాతాదారుడిని ఎలా దోపిడీ చేయాలనే ఆలోచనతోనే బ్యాంకులు తమ వ్యాపారాలను చేస్తుంటాయి. ఈ విషయాన్ని గుర్తించుకొని క్రెడిట్ కార్డు అవసరమైతేనే తీసుకోవాలి అని పలువురు బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు స్టేట్మెంట్ తనిఖీ చేసుకుంటూ, తప్పుడు లావాదేవీలు, ఎక్కువ వడ్డీలు వేస్తే కస్టమర్ కేర్ సెంటర్‌కు ఫోన్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. ఎప్పటి సమస్యను అప్పుడే పరిష్కరించుకోవాలని, పెండింగ్‌లో పెడితే కస్టమర్‌కే నష్టమని చెప్తున్నారు. క్రెడిట్ కార్డు నిబంధనలు పక్కాగా చుదువు కోవాలని పేర్కొంటున్నారు.