హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని గిరిజన గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఆ సంఘం నాయకులు కొన్ని రోజులుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్లు పరిష్కారానికి దశలవారీగా నిరసన తెలుపాలని నిర్ణయించారు. అయితే గిరిజన గురుకుల ఉపాధ్యాయులు జేఏసీగా ఏర్పడి ఉమ్మడి సమస్యల పరిష్కారానికి సర్కారును డిమాండ్ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం గురుకుల ఉపాధ్యాయులకు సంబంధించి రెండు జేఏసీలు ఏర్పడ్డాయి. అందులో ఒక జేఏసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ అధికారులను సంప్రదిస్తూ వినతి పత్రాలు అందజేస్తున్నది. మరో జేఏసీ ఒకటి రెండు రోజులలో తమ డిమాండ్ల సాధనకు సర్కారుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు ప్రకటించబోతున్నది. గిరిజన సంక్షేమ గురుకులాలతోపాటు అన్ని సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోని గురుకులాల్లో పాత టైంటేబుల్‌ను అమలు చేయాలని, విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచాలని, 010 పద్దు కింద సొసైటీ టీచర్లకు జీతాలు చెల్లించాలని, కామన్ సర్వీసు రూల్స్‌ను అమలు చేయాలని, ఇలా అనేక సమస్యలు పరిష్కారానికి ఈ రెండు జేఏసీలు పోరాడుతున్నాయి.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప దేవాలయ ఉపాలయం గొల్లగుడిలో దుండగులు గుప్తనిధుల కోసం ఆలయ పైకప్పు ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రామప్ప దేవాలయానికి పడమర వైపు గల రామప్ప చెరువుకు వెళ్లే దారిలోని గొల్లగుడి పైకప్పు భాగంలో రెండు చోట్ల రాళ్లను తొలగించారు. గుప్తనిధుల కోసమే దుండగులు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పురావస్తు శాఖ సిబ్బంది ఆదివారం శుభ్రం చేయడానికి వెళ్లగా ఆలయంలో ధ్వంసం అయినట్టు గ్రహించి ఉన్నతాధికారులకు సమాచారం అందించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -వెంకటాపూర్