హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో), తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) నేతలు సీఎస్ శాంతికుమారిని కోరారు. గురువారం వినతిపత్రాన్ని అందజేశారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులైన ప్రణాళికా సంఘం చైర్మన్ చిన్నారెడ్డి, ప్రొఫెసర్ కోదండరాంతో హైదరాబాద్‌లోని టీజేఎస్ కార్యాలయంలో టీఎన్జీవో అధ్యక్షుడు మారం జగదీశ్వర్, టీజీవో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివాసరావు, ఎనుగుల సత్యనారాయణ, టీఎన్జీవో ఉపాధ్యక్షుడు కస్తూరి వెంకట్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుస్సేనీతో కూడి న బృందం సమావేశమైంది.
గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కమిటీ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్‌లోని నాలుగు డీఏలను విడుదల చేయాలని, జీవో 317 సమస్యలు పరిష్కరించాలని, సీపీఎస్‌ను రద్దుచేయాలని, ఏపీలో పనిచేస్తున్న 144 మందికి వెనక్కి రప్పించాలని కోరారు.
గచ్చిబౌలిలో ఇండ్ల స్థలాలు ఇప్పించడం, పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని, నూతన జిల్లాలకు అదనపు క్యాడర్ స్ట్రెంత్ మంజూరు, రాష్ట్రస్థాయిలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని వినతిపత్రాన్ని సమర్పించారు. సమావేశంలో పలు సంఘాల నేతలు ముత్యాల సత్యనారాయణగౌడ్, శ్రీకాంత్, మల్లారెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, నరహరిరావు, శ్రీనివాసమూర్తి, సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు శ్రీనివాస్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, నరహరి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్, డ్రైవర్ సంఘాల నేతలు పాల్గొన్నారు.