జడ్పీహెచ్ఎస్ పీర్జాదిగూడ స్కూల్‌కు గతంలో కరెంటు బిల్లు రూ.800-రూ.1,500 వరకు వచ్చేది. అక్కడ సోలార్ విద్యుత్తును ఏర్పాటుచేసుకున్న తర్వాత నెలవారీ బిల్లు రూ.193కు పరిమితమైంది. ఈ పాఠశాలలో 2 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన తర్వాత ఒక నెలలో 264 యూనిట్లు, మరో నెలలో 349 యూనిట్ల విద్యుత్తును డిస్కంకు సరఫరా చేశారు. ఇలా అనేక ప్రభుత్వ పాఠశాలలల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటుచేయడంతో కరెంటు బిల్లులు భారీగా తగ్గిపోతున్నాయి.
హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటుచేసిన సౌర విద్యుత్తు ఉత్పత్తి యూనిట్లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటివరకు 1,521 పాఠశాలల్లో సోలార్ విద్యుత్తు ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేసింది. గత జూన్, జూలై మాసాల్లో వీటిని ఏర్పాటు చేయగా, ఆయా ప్లాంట్లల్లో విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించి, డిస్కంకు సరఫరా చేస్తున్నారు. దీంతో ఆయా పాఠశాలలపై కరెంటు బిల్లుల భారం తగ్గుతున్నది. దీంతో మరో 5,267 స్కూళ్లల్లో సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. వీటిలో 4,600 ఉన్నత పాఠశాలలు, 475 కేజీబీవీలు, 192 మాడల్ స్కూళ్లు ఉన్నాయి. ఇటీవల దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్తు వాడకం పెరుగుతున్నది. రెసిడెన్షియల్ పద్ధతిలో నిర్వహిస్తున్న గురుకులాలు, కేజీబీవీలు, మాడల్ స్కూళ్లలో మరింత ఎక్కువగా ఉంటున్నది. గదికి నాలుగు ట్యూబ్‌లైట్లు, నాలుగు ఫ్యాన్లు, కంప్యూటర్ ల్యాబ్‌లు, ట్యాబ్‌లు, డిజిటల్ విద్యలో భాగంగా ప్రొజెక్టర్లు, ఇంటరాక్టివ్ ఫ్ల్లాట్ప్యానళ్లు ఏర్పాటు చేయడంతో విద్యుత్తు వాడకం పెరుగుతున్నది. కరెంటు బిల్లులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో పాఠశాలల్లో ప్రభుత్వం సోలార్ విద్యుత్తు ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నది.
సగం గ్రాంట్ విద్యుత్తు బిల్లులకే సరి
పాఠశాలల నిర్వహణకు ప్రభుత్వం ఏటా స్కూల్ గ్రాంట్ నిధులను కేటాయిస్తున్నది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 15 మంది విద్యార్థులకు ఏటా రూ.12,500 చొప్పున, 16 నుంచి 100 మంది విద్యార్థులకు రూ.25 వేలు, 101-250 విద్యార్థులకు రూ.50 వేలు, 251-1000 మంది విద్యార్థులకు రూ.75 వేలు, వెయ్యి మందికి మించి విద్యార్థులు ఉన్న స్కూళ్లకు రూ.లక్ష చొప్పున గ్రాంట్ మంజూరుచేస్తున్నది. పాఠశాలల్లో రిజిష్టర్లు, స్టేషనరీ, ఇంటర్నెట్ చార్జీలు, మరమ్మతులు, విద్యుత్తు బిల్లుల చెల్లింపులతోపాటు ఆగస్టు 15, జనవరి 26న స్వీట్స్ పంపిణీకి కూడా ఈ నిధులనే వినియోగిస్తారు. సబ్బులు, హ్యాండ్‌వాష్, తాత్కాలిక సిబ్బంది వేతనాలను వీటి ద్వారానే చెల్లించేవారు. ఈ నిధుల్లో 50% విద్యుత్తు బిల్లుల చెల్లింపుకే సరిపోయేవి. దీంతో ఒక్కొక్కసారి ఇతర అవసరాలకు నిధులు సరిపోయేవి కాదు. పాఠశాలల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన తర్వాత కరెంటు బిల్లుల భారం గణనీయంగా తగ్గడంతో ఆ మేరకు ఉపశమనం లభిస్తున్నది.
శుభపరిణామం
ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ విద్యుత్తు యూనిట్లు ఏర్పాటు చేయడం శుభపరిణామం. వీటి ద్వారా సర్కారు బడులకు నాణ్యమైన విద్యుత్తు అందుతున్నది. గ్రీన్ఎనర్జీని వినియోగించుకోవడమే కాకుండా కరెంటు బిల్లులు భారీగా తగ్గుతాయి. ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు.
– బుర్రా అశోక్‌కుమార్‌గౌడ్, తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షుడు
బిల్లులు తగ్గుతున్నాయి
మా బడిలో 2 కిలోవాట్ల సోలార్‌ప్లాంట్‌ను ఏర్పాటుచేశాం. నెట్ మీటరింగ్‌తో రోజూ ఉత్పత్తి అయిన విద్యుత్తును టీఎస్ఎస్పీడీసీఎల్కు విక్రయిస్తున్నాం. గతంలో నెలకు రూ.800 రూ.900 బిల్లులొచ్చేవి. సోలా ర్ ఏర్పాటు తరువాత కరెంటు బిల్లు రూ.190 వస్తున్నది. స్కూల్ గ్రాంట్ నిధుల నుంచి విద్యుత్తు బిల్లులు చెల్లించేవాళ్లం. ఇప్పుడా నిధులను మరో రకంగా వాడుకునే వెసులుబాటు కలిగింది.
– సుశీల, హెచ్ఎం, జడ్పీహెచ్ఎస్ పీర్జాదిగూడ