హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజన (పీఎంఎస్జీవై) పథకం కింద ఏర్పాటు చేసే రూఫ్‌టాప్ సోలార్ పాంట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ప్రత్యేక నెట్ మీటరింగ్ ఒప్పందాలు అవసరంలేదని తేల్చి చెప్పింది. ఇకపై నెట్ మీటరింగ్ చార్జీలను సైతం మినహాయించాలని పేర్కొన్నది. పీఎంఎస్జీవై పథకానికి సంబంధించిన విధానాలను మరింత సరళీకరించాలని కేంద్ర విద్యుత్తు శాఖ ఇటీవల రాష్ర్టాలకు సూచించింది. 2024లో ప్రారంభమైన ఈ పథకం అమలు తీరుతెన్నులను కేంద్రం ఎప్పటికిప్పుడు సమీక్షిస్తున్నది. నెట్ మీటరింగ్ కోసం ప్రత్యేకంగా ఒప్పందం అవసరంలేదని, పీఎంఎస్జీవై పోర్టలోని ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌లో డిజిటల్ ఒప్పందం సరిపోతుందని కేంద్రం స్పష్టతనిచ్చింది. గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, జార్ఖండ్, హర్యానా డిజిటల్ ఒప్పందాలను అంగీకరిస్తున్నాయని, మిగతా రాష్ర్టాలు కూడా దీనినే అనుసరించాలని కేంద్రం సూచించింది. నెట్ మీటిరింగ్ చార్జీలను ఇప్పటికే 17 రాష్ర్టాలు మాఫీ చేశాయని పేర్కొన్నది.