Alagu Varshini | హైదరాబాద్, డిసెంబర్6 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో జరుతున్న వరుస సంఘటనలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ మీద, వాటిని వెలుగులోకి తెస్తున్న ‘నమస్తే తెలంగాణ’ పత్రిక మీద సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణి చిటపటలాడారు. బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆందోళనలు సిగ్గుచేటని, విద్యార్థులతో రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎక్కడో ఒక సంఘటన జరిగితే, దానిని పట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారని, బీఆర్ఎస్ నేతల ఆందోళన వల్ల గురుకులాల్లో పనిచేసేందుకు సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. ఇకపై అనుమతిలేకుండా ఎవరైనా గురుకులాలకు వెళ్తే క్రిమినల్ కేసులు పెట్టడమేగాక, అవసరమైతే అరెస్టు చేయిస్తామని హెచ్చరించారు. శుక్రవారం ఆమె మాసబ్‌ట్యాంక్‌లోని సొసైటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సొసైటీల్లో జరుగుతున్న వరుస ఫుడ్‌పాయిజన్, ఆత్మహత్యల సంఘటనలపై వివరణ ఇచ్చారు.
వచ్చే వరకూ అన్నం తినకండి
ఇటీవల సొసైటీలోని గురుకులాల్లో రెండు చోట్ల ఫుడ్‌పాయిజన్ జరిగిందని, బయటి నుంచి వచ్చిన ఆహారపదార్థాల వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వర్షిణి తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలకు పచ్చళ్లు పెట్టి పంపుతున్నారని, వాటివల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పారు. బయటి నుంచి, లేదంటే ఇండ్లకు వెళ్లి వచ్చిన అనంతరమే, సదరు విద్యార్థులే ఫుడ్‌పాయిజన్‌కు గురవుతున్నారని పేర్కొన్నారు. ఫుడ్పాయిజన్ను నివారించేందుకు సొసైటీ తరపున అనేక చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఎక్కడయినా గురుకులంలో భోజనం సరిగా లేకపోతే, తనకు నేరుగా ఫోన్ చేయాలని, మెసేజ్ పంపాలని, వీలైతే మెయిల్ చేయాలని, అంతేకాకుండా తాను వచ్చే వరకూ తినబోమని సొసైటీ సిబ్బందికి చెప్పాలని విద్యార్థులకు సైతం సూచించానని వర్షిణి వెల్లడించారు. కూరగాయలు తరలించేందుకు కంటెయినర్లు కొనుగోలు చేయాలని, శుభ్రమైన ప్రదేశాల్లో వంటలు చేయాలని, కుకింగ్ సిబ్బంది యూనిఫామ్స్, గ్లౌజ్, క్యాప్ పెట్టుకోవడం తప్పనిసరి చేశామని, ఆ జాగ్రత్తలు తప్పక పాటించాలని ఆదేశాలు జారీ చేశామని వివరించారు.
బీఆర్ఎస్ ఆందోళనలు సిగ్గుచేటు
ఎక్కడో ఒక చోట చిన్నపాటి సంఘటనలు జరిగినా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, బీఆర్ఎస్ నేతల విమర్శలు ఎకువయ్యాయని, సలహాలివ్వాలి కానీ విమర్శలు చేయొద్దని వర్షిణీ పేర్కొన్నారు. ఏమైనా చెప్పాలంటే అసెంబ్లీలో, లేదంటే సీఎస్, అధికారులను కలిసి చెప్పాలని కోరారు. బీఆర్ఎస్, పార్టీల నేతలు అలోచించి ఆందోళనలు చేయాలని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో పనిచేసిన టీచర్లే ఇప్పుడూ పనిచేస్తున్నారని, రేపు బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చినా కూడా వారే ఉంటారని పేర్కొన్నారు. రెసిడెన్షియల్ సూల్స్‌ను రాజకీయాలకు వాడుకోవద్దని, ప్రతిపక్ష పార్టీల నేతలు చేస్తున్న ఆరోపణలకు, ఆందోనళలతో టీచర్లు పనిచేయడానికి భయపడుతున్నారని తెలిపారు. గతంలో గురుకులాల గురించి చాలా గొప్పగా చెప్పానని, ఇప్పుడు చెప్పలేకపోతున్నానని, బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలను చూస్తే సిగ్గుగా ఉన్నదని వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం తమను ఫుట్‌బాల్‌గా వాడవద్దని ప్రతిపక్షనేతలకు విజ్ఞప్తి చేశారు.
5వ తరగతి ప్రవేశాలకు 18న నోటిఫికేషన్
గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నదని వర్షిణి వెల్లడించారు. 45 రోజులపాటు అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుందని, ఆన్లైన్ ద్వారా ఇంటి నుంచి, లేదంటే జోనల్ ఆఫీస్‌లకు వెళ్లి అడ్మిషన్ పొందవచ్చని ప్రత్యేకంగా అందుకోసం వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. దరఖాస్తు ప్రక్రియను మరింత సరళతరం చేశామని, కులం, ఆదాయం, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఉంటే సరిపోతాయని స్పష్టంచేశారు. కులం సర్టిఫికెట్ నంబర్ ఎంట్రీ చేయగానే అన్నివివరాలు స్వయంచాలకంగా నమోదవుతాయని వివరించారు. 2024 జనవరి 1 నుంచి తీసుకున్న సర్టిఫికెట్లే చెల్లుబాటవుతాయని స్పష్టంచేశారు. ఫిబ్రవరి 23న రాతపరీక్ష నిర్వహించి, జూన్ 12లోగా అడ్మిషన్ ప్రక్రియను పూర్తిచేయాలనే లక్ష్యంతో సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. ఇంటర్ ప్రవేశాలకు సంబంధించిన పరీక్షను ఈ ఏడాది నుంచి రద్దు చేస్తున్నామని, పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే నేరుగా సొసైటీ జూనియర్ కాలేజీల్లో ప్రవేశం పొందవచ్చని వెల్లడించారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీకి సంబంధించి కూడా అదే విధానాన్ని ప్రవేశపెడతామని, పదో తరగతిలో అత్యధిక ఉత్తీర్ణత సాధించిన సొసైటీ విద్యార్థులకే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. సమావేశంలో జాయింట్ సెక్రటరీ సక్రునాయక్, సొసైటీ అధికారులు అనంతలక్ష్మి, శారద, పలువురు జోనల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
‘నమస్తే తెలంగాణ’ను పట్టించుకోం
మీడియా సమావేశం సందర్భంగా ఇప్పటివరకు సొసైటీలో జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు, ఫుడ్‌పాయిజన్ అం శాలపై ఎలాంటి విచారణ చేశారు? అం దుకు సంబంధించిన నివేదికల వివరాలేమిటని ‘నమస్తే తెలంగాణ’ ప్రశ్నించగా.. సొసైటీ సెక్రటరీ వర్షిణి ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థుల సంక్షేమానికి గతంలో నుంచి అమలుచేస్తున్న అంశాలనే ఏకరువు పెట్టారు తప్ప అస లు ప్రశ్నలకు బదులివ్వలేదు. కొందరు విలేకరులు కావాలనే తప్పుడు రాతలు రాస్తున్నారని, సొసైటీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎదురుదాడికి దిగారు. అక్కడితో ఆగకుండా ‘నమస్తే తెలంగాణ’ను పరిగణనలోకి తీసుకోబోమని, ఏమైనా రాసుకోవచ్చని వర్షిణి పేర్కొనడం గమనార్హం.