సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీలో వెలుగు చూస్తున్న అక్రమాల వెనుక ఉన్నది ఎమ్మెల్సీ ఆశావహులేనని తెలిసింది. తమ రాజకీయ భవిష్యత్తు కోసం గురుకుల ఉపాధ్యాయులను ఆగం పట్టించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏ సొసైటీలోనూ లేనివిధంగా సోషల్ వెల్ఫేర్ సొసైటీలోనే బదిలీలు ఇంత గందరగోళంగా ఉండడానికి కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతతోపాటు మరో యూనియన్ నేత కారణమన్న చర్చ జరుగుతున్నది.
డీఎల్ బదిలీలు, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ పోస్టుల ప్రమోషన్లలో జరిగిన అవకతవకలపై ‘సీఎం శాఖలోనే పదోన్నతుల అర్రాస్’ పేరిట ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన ప్రత్యేక కథనం దుమారం రేపుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం గుట్టుగా విచారణను చేపట్టడం గమనార్హం.
Gurukula Transfers | హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీలో వెలుగు చూస్తున్న అక్రమాల వెనుక ఉన్నది ఎమ్మెల్సీ ఆశావహులేనని తెలిసింది. తమ రాజకీయ భవిష్యత్తు కోసం గురుకుల ఉపాధ్యాయులను ఆగం పట్టించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ సొసైటీలోనూ లేనివిధంగా సోషల్ వెల్ఫేర్ సొసైటీలోనే బదిలీలు ఇంత గందరగోళంగా ఉండడానికి కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతతోపాటు మరో యూనియన్ నేత కారణమన్న చర్చ జరుగుతున్నది. డీఎల్ బదిలీలు, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ పోస్టుల ప్రమోషన్లలో జరిగిన అవకతవకలపై ‘సీఎం శాఖలోనే పదోన్నతుల అర్రాస్’ పేరిట ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన ప్రత్యేక కథనం దుమారం రేపుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం గుట్టుగా విచారణను చేపట్టడం గమనార్హం.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ, కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సన్నిహితంగా, పార్టీలో కీలకంగా ఉన్న నాయకుడు వరంగల్-ఖమ్మం- నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కన్ను గురుకులాలపై పడింది. గురుకుల సొసైటీకి చెందిన ఓ యూనియన్ నేతతో కలిసి బదిలీలను ఆసరాగా చేసుకుని ప్రణాళికలను రూపొందించి అమలు చేశారని టీచర్లు చర్చించుకుంటున్నారు. ఆ యూనియన్ నేత కూడా కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి బరిలో నిలవాలని కుతూహలం చూపుతున్నారు. దీంతో లోపాయికారీ ఒప్పందం చేసుకుని యూనియన్ నేతను ముందు పెట్టి వెనకాల ఈ తతంగమంతా నడింపిచారని గురుకుల ఉపాధ్యయవర్గం కోడై కూస్తున్నది. కేసీఆర్ హయాంలో పెద్ద ఎత్తున ఏర్పాటైన గురుకులాల వల్ల టీచర్ల సంఖ్య బాగా పెరిగింది. దీంతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీరు కీలకంగా మారారు. ఈ నేపథ్యంలో వారిని మంచి చేసుకోవడం ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే తాము పోటీలో నిలబడబోయే స్థానాల్లో ముందుగానే తమవారిని నియమించుకునేందుకు, అక్కడి గురుకుల సిబ్బందిని మచ్చిక చేసుకునేందుకు ఈ బదిలీలు, ప్రమోషన్లను పావుగా వాడుకున్నారు. తమకు అనుకూలమైన వారి కోసం, అనుకూలమైన స్థానాలను ఇప్పించడంలో చక్రం తిప్పారు. అందుకోసమే ఏ సొసైటీలోనూ లేనివిధంగా ఇక్కడమాత్రమే పట్టుబట్టి ఆఫ్‌లైన్‌లోనే బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టేలా చేసి తమ ప్రణాళికలను గుట్టుగా అమలు చేశారని చెప్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అర్హులు, మెరిట్ ఉన్నవారు తీవ్రంగా నష్టపోయారని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల కోసం తమ జీవితాలతో చెలగాటమాడరని వాపోతున్నారు.
‘నమస్తే తెలంగాణ’ పత్రికలో ప్రచురితమైన ప్రత్యేక కథనంతో సొసైటీ ప్రధాన కార్యాలయ ఉద్యోగులతోపాటు, బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియలో భాగస్వాములైన ఉపాధ్యాయులు ఉలిక్కిపడ్డారు. ‘ఇప్పుడెలా?’ అని చర్చించుకున్నట్టు తెలిసింది. ఇందులో కీలకంగా వ్యవహరించిన ఉన్నతాధికారులను సొసైటీ సెక్రటరీ హెడ్ ఆఫీస్‌కు పిలిపించుకుని ఆరా తీసినట్టు సమాచారం. టీచర్ల జాబితాల ఎంట్రీలో కీలకంగా వ్యవహరించిన డాటా ఎంట్రీ ఆపరేటర్ రెండ్రోజులుగా ఎవరికీ అందుబాటులో లేకుండా పోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.‘నమస్తే’ కథనంతో గురుకుల సొసైటీల్లోని ఇతర టీచర్లందరిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
గురుకుల సొసైటీ బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించి ‘నమస్తే’లో ప్రచురితమైన కథనంతో ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందిపై ప్రభుత్వం సీరియస్‌గానే స్పందించినట్టు విశ్వసనీయ సమాచారం. సాంఘిక సంక్షేమశాఖ ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి వద్దనే ఉన్నది. సీఎం అజమాయిషీలోని శాఖలోనే అక్రమాలు వెలుగుచూడడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కాంగ్రెస్ నాయకుడు ఎవరు? యూనియన్ నేత ఎవరు? ఇందులో భాగస్వాములైన ఉద్యోగుల ఎవరు? ఇంకా ఎవరెవరున్నారు? సెక్రటరీ కనుసన్నల్లోనే ఇది జరిగిందా? లేదంటే తప్పుదోవపట్టించారా? అనే కోణంలో గుట్టుగా విచారణ ప్రారంభించినట్టు సచివాలయ అధికారులు చెప్తున్నారు. సొసైటీలోని ఇతర సిబ్బంది ద్వారా సదరు ఉద్యోగుల వివరాలతో, బదిలీలు, ప్రమోషన్లు కొనసాగించిన ప్రక్రియపైనా గుట్టుగా ఆరా తీస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశమున్నది.