రేవంతం సారుకు ఢిల్లీ నుంచి ఫోనొచ్చింది. పెద్ద మేడమ్ ఫోన్ చేశిందని పీఏ చెప్పంగనే అప్పటిదాకా ఆరాంసే కుర్చీల కూసున్న సారు దబ్బుమని నిలవడ్డడు. ‘మేడమ్..’ అనుకుంట సగం ఒంగిండు.
పెద్ద మేడం: రేవంతం జీ.. మా వాడికి మేడిగడ్డ బరాజ్ మీద ఎక్స్పాన్షన్ జాయింట్ చూపెట్టి క్రాక్ అని ఫూల్ను చేసిన్రట. ఇదేం పద్ధతి హై.
రేవంతం: అంటే మేడం.. అది నిజంగనే క్రాక్ కాదా? అంత పెద్దగ కనిపిస్తున్నది కదా.. అందుకే క్రాక్ అనుకున్న.
పెద్ద మేడం: క్రాక్కు, జాయింట్కు తేడా తెల్వకుండా బరాజ్ చూడనీకి ఎందుకు పోయిండ్రు?
రేవంతం: నేను వద్దని చెప్పిన మేడం. ఆడికి పోతే గంత పెద్ద బరాజ్ చూసి అబ్బా.. అని నోరు తెరిశి వచ్చుడు, నీళ్లు, పచ్చటి పొలాలు సూశి సల్లవడుడు తప్ప మనకేం తెల్వదు సార్ అని చెప్పిన. అయినా మన చిన్నబాబు ఇనలే. పోదాం.. పోదాం.. అని మొండిపట్టు వట్టిండు. సరేతియ్యి జెరశేపు ఆనందపడుతడని తీసుకపోయిన.
పెద్ద మేడం: మంచిగున్నరు పో. ఒకడు పెద్ద పప్పు.. ఇంకొకడు తెలంగాణ పప్పు. సరిపోయిర్రు ఇద్దరు.
రేవంతం: థాంక్యూ మేడం.
పెద్ద మేడం: పప్పు అంటే థాంక్యూ అంటున్నవ్.
రేవంతం: నన్ను మీ కొడుకు తోటి సమానంగా పోల్చినరు గదా మేడం.. గందుకే థాంక్యూ చెప్పిన.
పెద్ద మేడం: సర్లే.. తెలంగాణల కాంగ్రెస్ భవిష్యత్తు అర్థమైందిగనీ.. చెయ్యి ఎట్లున్నది మరి.
రేవంతం: (నా చెయ్యికి ఏమైంది? అని మనసుల అనుకున్నడు. పార్టీ గురించేమో అనుకొని) మంచిగనే ఉన్నది మేడం. మనం గెలుసుడు పక్కా. ప్రభుత్వం మనదే (అని గట్టిగనే కవర్ చేశిండు).
పెద్ద మేడం: నేను అడిగింది పార్టీ గురించి కాదు.. దాని సంగతి నాకు ఇప్పుడే అర్థమైందిగనీ.. మీ చెయ్యి జెర ఉబ్బిందని మావోడు చెప్పిండు అందుకనే అడుగుతున్న.
రేవంతం: ఓ గదా మేడం.. ఈ మధ్యల జెర పార్టీలో చేరికలు ఎక్కువైనయ్ కదా. అందరికీ పార్టీ కండువాలు కప్పీ.. కప్పీ.. చెయ్యి ఉబ్బింది. గంతే..
పెద్ద మేడం: దాన్ని తెలుగుల ఏమంటరు?
రేవంతం: వాపు అంటరు మేడం. బెణికినా, నరం మర్లవడ్డా, ఎక్కువ పని చేశినా, అడ్డమైనయన్నీ తిన్నా వాపు వస్తుంటది.
పెద్ద మేడం: ఎప్పటికీ అట్లనే ఉంటదా?
రేవంతం: అట్లుండది మేడం.. నాలుగొద్దులు ఉండి, తగ్గిపోతది.
పెద్ద మేడం: మన పార్టీలో మస్తుమంది చేరుతున్నరని మీరు రిపోర్టులు ఇస్తున్నరు. మావోడు గూడ ఆహా.. ఓహో అంటున్నడు.
రేవంతం: అవును మేడం.. మస్తు మంది పెద్ద పెద్ద లీడర్లు వచ్చి జాయిన్ అయితున్నరు.
పెద్ద మేడం: వాళ్లతోని క్యాడర్ వస్తున్నదా?.
గంతే.. రేవంతం సారు నుంచి సప్పుడు లేదు.. లీడైర్లెతే వస్తున్నరు అని చెప్పుకొచ్చిండు.
పెద్ద మేడం: ఆ పార్టీ వద్దనుకున్నోళ్లు, ఈ పార్టీల టికెట్ కూడా తెచ్చుకోలేనోళ్లు..ఇటు ప్రజలు, వేరే పార్టీలు తిరస్కరించిన నాయకులకు మీరు కండువా కప్పుతున్నరు. మస్తు మంది చేరుతున్నరని చెప్పుకుంటున్నరు. పార్టీ మస్తు బలం అయ్యిందని గప్పాలు కొడుతున్నరు. కానీ.. క్యాడర్ లేని లీడర్ వస్తే.. అడ్డమైనయి తింటే చెయ్యి వాశినట్టే పార్టీ కూడా లీడర్లతోని నిండిపోయింది. అది వాపే తప్ప మీరు అనుకునేది కాదు.. (అని క్లాస్ పీకింది).
(గంతే.. రేవంతం సారు నోట్లకెల్లి ఒక్క మాట బయటికి రాలే. సల్లగ శెమటలు మోపయినయి. వాశిన చెయ్యిని చూసుకుంట.. కళకళలాడుతున్న కారు దిక్కు చూసుకుంట.. నలిగిపోయిన కమలం పువ్వును చేతుల పట్టుకొని తూర్పుదిక్కు తిరిగిండు).
-కాసాని మహేందర్ రెడ్డి