హైదరాబాద్, జూన్10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో త్వరలో చేపట్టబోయే ‘సామాజిక, ఆర్థిక కుల సర్వే’ కార్యాచరణ ప్రణాళికపై మేధావులు, విషయ నిపుణుల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు వెల్లడించారు. ఇందులో భాగంగా ‘పీపుల్స్ కమిటీ ఆన్ క్యాస్ట్ సెన్సస్ (పీసీఓసీఎస్) విషయ నిపుణులు, మేధావుల బృందంతో రాష్ట్ర బీసీ కమిషన్ సోమవారం ప్రత్యేకంగా భేటీ అయింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో నిర్దిష్టంగా కుల సర్వే కోసం కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై లిఖిత పూర్వకంగా పలు అధ్యయన పత్రాలు అందించింది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, బీహార్‌లో నిర్వహించిన కుల సర్వేలపై చర్చించింది.
సర్వే చేస్తున్నప్పుడు ఎదురైన న్యాయపర సమస్యలు, ప్రజాస్పందన, వివిధ సాంకేతిక అంశాలు, సాఫ్ట్వేర్ రూపకల్పన, ఇలా ఒకొకటిగా కమిషన్‌కు పీపుల్స్ కమిటీ ప్రతినిధుల బృందం సాధికారికంగా వివరించింది. ఈ సందర్భంగా వకుళాభరణం మాట్లాడుతూ కుల సర్వే కార్యాచరణ ప్రణాళిక తయారీలో భాగంగా, త్వరలోనే రాష్ట్రంలోని అన్నివర్గాలు, మేధావులు, ప్రజా, కుల సంఘాల ప్రతినిధులను ఆహ్వానిస్తామని వెల్లడించారు. వారంలోపే తేదీలను ప్రకటిస్తామని, అందరి అభిప్రాయాలు ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. బీసీ కమిషన్ సభ్యులు సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కిశోర్‌గౌడ్, సభ్య కార్యదర్శి బాలమాయ దేవి, పీపుల్స్ కమిటీ ప్రతినిధులు జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ మురళీమనోహర్, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు, ప్రొఫెసర్ ఐ తిరుమలి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, ప్రొఫెసర్ సింహాద్రి, ప్రొఫెసర్ పద్మజాషా, ప్రొఫెసర్ నరేంద్ర బాబు, డాక్టర్ ఎస్ పృథ్వీరాజ్, దేవల్ల సమ్మయ్య, సతీశ్కొట్టె తదితరులు పాల్గొన్నారు.