హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో స్మార్ట్ఫోన్లను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా(సఫారీ ప్రాంతం)లోకి వెళ్లేటప్పుడు పర్యాటకులు వారి ఫోన్లను చెక్‌పోస్ట్ దగ్గర డిపాజిట్ చేయాలి. ఫొటోగ్రఫీ కోసం వెళ్లేవారికి ఫ్లాష్‌లైట్ లేని సాధారణ డిజిటల్ కెమెరాలను అనుమతిస్తారు. నిబంధనలు ఉల్లంఘించి దొంగచాటుగా ఫోన్లు తీసుకెళ్లినా, ఫ్లాష్లైట్లతో జంతువులను ఇబ్బందులు పెట్టినా భారీగా జరిమానా విధించడంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. త్వరలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు వెలువడనున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. స్మార్ట్ఫోన్ల వల్ల వన్యప్రాణుల ప్రశాంతత దెబ్బతినడమే కాకుండా, వాటి భద్రతకు కూడా ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అడవిలో పులి ఎక్కడ కనిపించిందో పర్యాటకులు ఫొటోలు తీసి.. లైవ్ లొకేషన్ ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల పరోక్షంగా వన్యప్రాణుల వేటగాళ్లకు సమాచారం అందించినట్టు అవుతున్నది.
అంతేకాకుండా టైగర్ సఫారీలకు వెళ్లే పర్యాటకులు కొందరు సామాజిక మాధ్యమాల్లో రీల్స్, లైవ్ వీడియోల కోసం జంతువులు కదిలేలా గట్టిగా అరుస్తూ వికృత చేష్టలకు పాల్పడుతున్నట్టు కేంద్రం గుర్తించింది. దీనివల్ల పులులు, చిరుతలతోపాటు ఇతర వన్యప్రాణులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయని, వాటి సహజసిద్ధ ప్రవర్తన మారిపోతున్నదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయాలంటే మొబైల్హ్రిత జోన్‌గా రిజర్వ్ ఫారెస్ట్‌లను ప్రకటించడమే ఏకైక మార్గంగా కేంద్రప్రభుత్వం భావిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తే రాష్ట్రంలోనూ అమలు చేసే యోచనలో తెలంగాణ అటవీశాఖ సన్నద్ధమవుతున్నది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలోని అమ్రాబాద్, కవ్వాల్ ప్రాంతాల్లో ఈ ఆంక్షలు మొదట అమలు చేయనున్నట్టు అధికారులు తెలిపారు.