హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): కేంద్రప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించి, రాష్ర్టాల మెడపై కత్తిపెట్టి వ్యవసాయ మోటర్లకు బిగింపజేస్తున్న స్మార్ట్ మీటర్లు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. తిరిగితే రాకెట్ వేగంతో వినియోగానికి మించి రీడింగ్ చూపిస్తుండగా, తిరగకపోతే సున్నా రీడింగ్‌తో సైలెంట్ అయిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక సమస్యతో రైతన్నల సహనానికి పరీక్ష పెడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో అమర్చిన స్మార్ట్ మీటర్లపై పుణెకు చెందిన ప్రయాస్ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తేలిన పచ్చి నిజం ఇది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటువల్ల విద్యుత్తు ఆదాకంటే వృథాయే ఎక్కువగా ఉన్నదని ఆ సంస్థ స్పష్టంచేసింది. విద్యుత్తును ఆదా చేయాలంటే వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెప్తున్నది. రాష్ర్టాలను ఇందుకు బలవంతంగానైనా ఒప్పించేందుకు ఆర్థిక ఇబ్బందులకు కూడా గురిచేస్తున్నది.
ఈ నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఈ మీటర్లను అమర్చింది. జిల్లాలో 28 వేల వ్యవసాయ పంపుసెట్లకు ఇన్ఫ్రారెడ్ మీటర్లు అమర్చారు. ఈ మీటర్ల వినియోగం, పనితీరుపై స్వచ్ఛంద సంస్థ ప్రయాస్ ఎనర్జీ గ్రూప్ (పీఈజీ) నిర్వహించిన అధ్యయనంలో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. మోటర్లకు ఈ మీటర్లు పెట్టడంవల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదని తెలంగాణ సీఎం కేసీఆర్ ముందే గ్రహించి ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వ తీరును పలు మార్లు తూర్పారబట్టారు. ఈ అంశంపై నిరసన తెలిపిన తొలి సీఎం కేసీఆరే.
అధ్యయనంలో తేలిన అంశాలు