హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ(శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) సొరంగం తవ్వకం పనులు పునరుద్ధరించామని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. సచివాలయంలో ఎస్‌ఎల్‌బీసీతోపాటు, డిండి ఎత్తిపోతల పథకం, అచ్చంపేట బ్రాంచ్ కెనాల్ పనుల పురోగతిపై శుక్రవారం ప్రత్యేకంగా సమీక్షించారు.
నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీధర్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్, జాయింట్ సెక్రటరీ కే శ్రీనివాస్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు చేశారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. దేవరకొండ ఔట్లెట్ నుంచే కాకుండా, ప్రస్తుతం ఇన్లెట్ టన్నెల్ నుంచి కూడా పను లు ప్రారంభమయ్యాయని, ఇకపై నిరంతరాయంగా కొనసాగుతాయని వెల్లడించారు. అదనపు భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు.