SLBC Tunnel | హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): శ్రీ శైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగం తవ్వకంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ‘దోని సప్పుడే కానీ దొయ్య పారింది లేదు’ అన్న సామెతను మరిపిస్తున్నది. ఇటీవల సంభవించిన ప్రమాదంతో ఇన్లెట్ ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు ముందుకుసాగే పరిస్థితి లేకుండా పోయింది. అవుట్లెట్ టన్నెల్ పనులు కూడా ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు దరిదాపుల్లో కనిపించడం లేదు. విదేశాల నుంచి టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్) ప్రధాన బేరింగ్ (సొరంగాన్ని తొలిచే విడి యంత్ర భాగం) రాకపోవడమే ఇందుకు ప్రధానం కారణం. ఆ టీబీఎం బేరింగ్ ఎక్కడ ఉన్నది? ఎందాక వచ్చింది? ఏమిటీ కథ? అన్న విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే యంత్ర పరికరాలను తెప్పించి సొరంగం పనులను చేస్తామంటూ హడావుడి చేసింది.
నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏకంగా అమెరికాకు వెళ్లి టన్నెల్ తవ్వకం పనుల్లో జేపీ అసోసియేట్స్‌తో భాగస్వామ్య సంస్థ అయిన రాబిన్సన్ కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. టీబీఎం ప్రధాన బేరింగ్, రింగ్ గేర్, అడాప్టర్ తదితర విడిభాగాలు వస్తున్నాయని, 2024 అక్టోబర్ నాటికే పనులను ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి ప్రకటనలు గుప్పించారు. ఆ గడువు దాటి ఇప్పటికి 6 నెలలు దాటినా ఇప్పటికీ విడిభాగాలు రాలేదు, పనులు ప్రారంభమూ కాలేదు. టీబీఎం బేరింగ్, విడిభాగాలతోపాటు పనుల పునఃప్రారంభానికి ప్రభుత్వం నిధులను చెల్లించింది. కానీ ఆ నిధులను జేపీ అసోసియేట్స్ పూర్తిస్థాయిలో రాబిన్సన్ కంపెనీకి చెల్లించకపోవడంతో ఆ కంపెనీ టీబీఎం విడిభాగాలను పంపేందుకు మొండికేసింది. తుదకు కొంత మొత్తం నిధులను చెల్లించడంతో ప్రధాన బేరింగ్‌ను మాత్రమే పంపినట్టు తెలుస్తున్నది.
ఇటీవల ఆ టీబీఎం బేరింగ్ కార్గో షిప్ ద్వారా అ మెరికా నుంచి చెన్నై షిప్‌యార్డ్‌కు చేరుకున్నట్టు సమాచారం. కస్టమ్స్ సుంకాన్ని చెల్లించి ఆ బేరింగ్‌ను స్వాధీనం చేసుకోవాలి ఉన్నది. అయితే జేపీ అసోసియేట్స్ ఇంకా ఆ సుంకాన్ని చెల్లించకపోవడంతో బేరింగ్ చెన్నై షిప్‌యార్డ్‌లోనే మూలుగుతున్నది. అదేమంటే సుంకం చెల్లించేందుకు డబ్బుల్లేవని, ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే ఆ బేరింగ్‌ను విడిపించగలమని జేపీ అసోసియేట్స్ చెప్తున్నట్టు అధికారులు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం టీబీఎం మెయిన్ బేరింగ్ మాత్రమే వచ్చిందని, ఇంకా రింగ్ గేర్, అడాప్టర్ కూడా రావాల్సి ఉన్నదని, అవి వస్తేనే పనులు ముందుకు సాగుతాయని తెలిపారు. దీంతో అవుట్లెట్ పనులు ఇప్పట్లో ప్రారంభం కావని స్పష్టమవుతున్నది. గత అక్టోబర్ నాటికే అవుట్ లెట్ పనులను ప్రారంభిస్తామని ప్రభుత్వ పెద్దలు బీరాలు పలికినా ఇప్పటికీ పరికరాలే రాని దుస్థితి నెలకొన్నది.
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నల్లగొండ జిల్లాకు కృష్ణా జలాలను తరలించేందుకు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టును రూపొందించారు. దీనిలో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి దిండి రిజర్వాయర్ వరకు మొత్తంగా 43.50 కి.మీ. సొరంగాన్ని తవ్వాల్సి ఉన్నది. ఈ పనులను జేపీ అసోసియేట్స్ ఏజెన్సీ దక్కించుకున్నది. టన్నెల్ తవ్వకానికి అమెరికాకు చెందిన రాబిన్సన్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నది. ఆ తర్వాత ఏకకాలంలో రెండువైపుల నుంచి ఇన్లెట్ పనులు అచ్చంపేట మండలం దోమలపెంట వద్ద శ్రీశైలం రిజర్వాయర్ గట్టు నుంచి, అవుట్లెట్ మహబూబ్‌నగర్ జిల్లా మన్యవారిపల్లె నుంచి సొరంగం పనులు చేపట్టారు.
ఇన్లెట్ వైపు నుంచి 13.93 కి.మీ. సొరంగం తవ్వాక ప్రమాదం సంభవించడంతో పనులు నిలిచిపోయాయి. అవుట్లెట్ వైపు నుంచి దాదాపు 22 కి.మీ. సొరంగం తవ్వారు. దీంతో ఇప్పటివరకు రెండువైపుల నుంచి కలిపి 34.372 కి.మీ. సొరంగం పనులు పూర్తయ్యాయి. ఇంకా 9.560 కి.మీ. మేర సొరంగాన్ని తవ్వాల్సి ఉన్నది. ప్రస్తుతం అవుట్లెట్ వైపు నుంచైనా పనులు ముందుకు సాగుతాయని భావిస్తే బేరింగ్ లేక పరిస్థితి కనబడటమే లేదు.
అవుట్లెట్ టన్నెల్లో హార్డ్‌రాక్ కాకుండా క్వార్ట్ రాక్ ఉండటం, ఇతర సాంకేతిక సమస్యలతో టీబీఎం బేరింగ్ తరచూ విఫలమవుతున్నది. టీబీఎం అమెరికాకు చెందిన రాబిన్సన్ కంపెనీది. ఆ యంత్ర పరికరాలు, విడిభాగాలతోపాటు నిపుణులు కూడా అక్కడి నుంచే రావాల్సి ఉన్నది. అవుట్లెట్ టన్నెల్లో టీబీఎం ప్రధాన బేరింగ్ 2018లో రెండోసారి విఫలమైంది. ఆ తర్వాత అమెరికా నుంచి ఆ బేరింగ్ తీసుకొచ్చి రీప్లేస్ చేయడంతో 2021న టీబీఎం పునఃప్రారంభమైంది. కానీ, అదే ఏడాది నవంబర్‌లో మెయిన్ బేరింగ్ మళ్లీ మరమ్మతుకు గురవడంతో పనులు పూర్తిగా నిలిపేశారు.
ఆ బేరింగ్ పునరుద్ధరణకు దాదాపు 6 నెలలు పట్టడంతో 2022 జూన్‌లో పనులను పునఃప్రారంభించారు. నాటి నుంచి 2023 జనవరి వరకు పనులు కొనసాగడంతో దాదాపు 1.428 కి.మీ. పొడవున సొరంగం పూర్తయింది. ఆ తర్వాత టీబీఎం మెయిన్ బేరింగ్ మూడోసారి విఫలమైంది. ఆ సొరంగం పనులను చేపట్టిన జేపీ అసోసియేట్స్ అమెరికాలోని రాబిన్సన్ కంపెనీకి డబ్బు ను చెల్లించకపోవడంతో యంత్ర పరికరాలు రాలేదు. దాంతో నాటి నుంచి పనులు నిలిచిపోయాయి.