హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను వచ్చే రెండేండ్లలో పూర్తిచేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి.. సోమవారం ఒహయోలోని రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మెషినరీ మానుఫ్యాక్చరింగ్ కంపెనీని సందర్శించి సీఈవో లాక్ హోంతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా టన్నెల్ తవ్వకానికి ఉపయోగించే అధునాతన నిర్మాణ యంత్ర సామగ్రిని సీఈవో లాక్హోం మంత్రికి వివరించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు బేరింగ్ సమస్యతోపాటు ఇతర మరమ్మతుల వల్ల ఆగిపోయాయని, పరికరాలను వీలైనంత త్వరగా అందించాలని సీఈవోను మంత్రి కోమటిరెడ్డి కోరారు. గ్రీన్ చానల్ అమలులో ఉన్నందున పనులు జరిగిన 40 రోజుల్లోనే చెల్లింపుల అంశంపై మంత్రి వివరించారు. కార్యక్రమంలో సాగునీటి పారుదలశాఖ నల్లగొండ సీఈ వీ అజయ్‌కుమార్, జైప్రకాశ్ అసోసియేట్ కంపెనీ డైరెక్టర్ పంకజ్ గౌర్, రాబిన్స్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.