దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిన శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) ప్రమాదానికి కారణమేంటి?.. 8 మంది కార్మికుల ప్రాణాలు మట్టి దిబ్బల కింద కలిసిపోయిన దుర్ఘటనకు కారకులెవరు? ఏమాత్రం అంచనాలు లేకుండా.. ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా.. ఆగమేఘాలపై టన్నెల్ పనులను ప్రారంభించడమే కొంపముంచిందా? పొట్టకూటి కోసం రాష్ర్టాలు దాటి వచ్చిన 8 మంది అభాగ్యుల కుటుంబాల్లో ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యమే చిచ్చుపెట్టిందా? శ్రీశైలం నుంచి ఇన్లెట్ టన్నెల్లో 13.670వ కిలోమీటరు వద్ద 8 మీటర్ల మేర రాతిపొరల్లో పెద్దఎత్తున సందులు ఉండి, వాటి ద్వారా భారీగా నీళ్లు రావడం, మట్టి వదులుగా ఉండడాన్ని (షియర్ జోన్) గతంలోనే గుర్తించినా సమస్య పరిష్కారానికి నామమాత్రపు చర్యలు తీసుకుంటూ పనుల్లో పురోగతి చూపాలన్న కంపెనీ అత్యుత్సాహమే ప్రమాదానికి దారితీసిందా? అంటే ‘అవును’ అనే నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూణ్నెళ్లకే ప్రాజెక్టుపై సమీక్షించి, 20 నెలల్లోనే పూర్తిచేస్తామని హడావుడి చేసి, కాంట్రాక్టు కంపెనీపై తీవ్ర ఒత్తిడి చేసిందని, ఎలాంటి ప్రమాణాలు, పద్ధతులు పాటించకుండా కేవలం గ్రౌటింగ్‌కు పరిమితమై కంపెనీ పనులు చేపట్టడం వల్లే సొరంగం కుప్పకూలి 8 మంది బలయ్యారని తేల్చిచెప్తున్నారు.
SLBC tunnel Incident | (గుండాల కృష్ణ) హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 1 (నమస్తే తెలంగాణ): మనం ఒక దారిలో నడుచుకుంటూ పోతున్నాం. దారి సాఫీ గా ఉన్నపుడు ఎప్పుడూ వేసే అడుగులే వేస్తాం. కానీ ముందు ఒక పెద్ద గుంత వస్తే?! మనం వేసే అడుగులో తేడా ఉంటుంది. ఆ గుంత ఎంత పొడవు ఉన్నది? మనం ఎంతమేర పెద్ద అడుగు వేయాలి? ఇవన్నీ మన మెదడులో అంచనా వేసుకొని అడుగు వేస్తాం. ఆ గుంత దాటామంటే మనం వేసిన అంచనా సరైనదే అనుకుంటాం. గుంతలో పడినట్టయితే మన అంచనా తప్పిందనుకుంటాం. మరి… దీని ని ప్రమాదవశాత్తు జరిగిందనుకోవాలా? అంచనా తప్పి జరిగిందనుకోవాలా? ఇక రెండో విషయం.. ఆ గుంత దాటకుండా మనం ఒక గంట పాటు ఆగాం అనుకుందాం! మనం ఆగడం వల్లనే ఆ గుంత ఏర్పడినట్టవుతుందా?! గంటసేపు ఆగకుండా ముందుగానే అడుగు వేస్తే ఆ గుంత మాయమయ్యేదా? ఆలస్యం చేసినందునే గుంత ఏర్పడి అందులో పడిపోయామనడం ఎంతవరకు సబబు?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ సొరంగం (ఎస్ఎల్బీసీ) ఘటన కూడా ఇలాంటిదే. పొట్టకూటి కోసం రాష్ర్టాలు దాటి వచ్చిన ఎనిమిది మంది అభాగ్యుల కుటుంబాల్లో చిచ్చు పెట్టిన ఈ దుర్ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? ఏజెన్సీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆ ఎనిమిది మంది మృత్యువాత పడ్డారా? అనే చర్చ ప్రస్తుతం జరుగుతున్నది. అయితే, ‘పదేండ్లపాటు కేసీఆర్ ప్రభుత్వం పనులు ఆపడం వల్లనే’ ఈ ప్రమాదం జరిగినట్టు అసంబద్ధంగా వ్యాఖ్యానించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సొరంగం ఘటనలో ఎనిమిది మంది చనిపోవడం వెనక అసలు కారణాలేంటి? తాజా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సొరంగం పనుల ప్రారంభానికి ముందు చోటుచేసుకున్న పరిణామాలేంటి? అనేవి ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం-1 పొడవు 43.93 కిలోమీటర్లు. ఇందులో 2014 వరకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 22.890 కిలోమీటర్లు పూర్తి చేసింది. ఆపై కేసీఆర్ ప్రభుత్వం మరో 11.482 కిలోమీటర్ల పనులు చేయడంతో పాటు 7.5 టీఎంసీల సామర్థ్యంతో నక్కలగండి రిజర్వాయర్, దీంతో పాటు పెండ్లిపాకల రిజర్వాయర్ల నిర్మాణాలు కూడా దాదాపుగా పూర్తి చేసింది. ఆ నిర్మాణాలు కండ్ల ముందు కూడా కనిపిస్తున్నాయి. ఇక, 2023, డిసెంబరులో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత పదిహేను నెలల్లో పూర్తి చేసిన పనులు కేవలం 18 మీటర్ల సొరంగ నిర్మాణం మాత్రమే. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ఈ 18 మీటర్ల పనులను గత నెలలోనే సర్కారు ప్రారంభించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం డ్రిల్లింగ్ చేసిన ఆ 18 మీటర్లలోనే కొంత భాగంలో పైకప్పు కూలి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కేసీఆర్ హయాంలో పదేండ్ల పాటు నిర్లక్ష్యం వహించారంటూ నిత్యం విమర్శిస్తూ ఎస్ఎల్బీసీ దుర్ఘటనపై చర్చను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై 2024, ఫిబ్రవరిలో తొలిసారిగా సమీక్ష నిర్వహించింది. 20 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పదేపదే ప్రకటనలతో హంగామా చేశారు. కానీ మొదటి సమీక్ష జరిగిన ఏడాదికి అంటే గత నెల 16-17 తేదీల్లో డ్రిల్లింగ్ పనులు మొదలుపెట్టారు.18 మీటర్లు తవ్విన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. ఇందులో ఎంతమేర కూలిందనేది మున్ముందు తేలనుంది.
ఏడాది కిందట ఎస్ఎల్బీసీపై సమీక్ష జరిగిన తర్వాత జేపీ కంపెనీకి ప్రభుత్వం అడ్వాన్సు చెల్లించింది. అప్పటి నుంచి ‘త్వరలో బేరింగ్ రానుంది… అవుట్లెట్ నుంచి పనులు మొదలుకానున్నాయ’ని పదేపదే మంత్రులు ప్రకటనలు చేశారు. ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏకంగా అమెరికా వెళ్లి రాబిన్సన్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. అనంతరం 2024, అక్టోబరులో బేరింగు అమర్చి అవుట్లెట్ పనులు మొదలుపెడతామని జేపీ కంపెనీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కానీ ఇప్పటిదాకా బేరింగు వచ్చింది లేదు… పనులు మొదలైంది లేదు. అసలు బేరింగ్ తయారీకి జేపీ కంపెనీ ఆర్డర్ ఇచ్చిందా? ఒకవేళ ఇచ్చి తయారైతే బేరింగ్ ఎక్కడి వరకు వచ్చింది? అనేది ప్రభుత్వానికి సైతం తెలియని పరిస్థితి.
మరోవైపు కొన్నిరోజుల కిందట అవుట్లెట్ పనుల ప్రారంభంపై ఇంజినీర్లు జేపీ కంపెనీని నిలదీస్తే… బేరింగుతో పాటు మరికొన్ని సామగ్రి కూడా రావాల్సి ఉందని చెప్పినట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. ఈ క్రమంలోనే మంత్రులు, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు నిత్యం సొరంగం డ్రిల్లింగ్ పనులు ఎప్పుడు మొదలవుతాయంటూ జేపీ కంపెనీపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. దీంతో అందరూ అవుట్లెట్ (నాగర్‌కర్నూల్ జిల్లా మన్నెవారిపల్లి వైపు) నుంచి పనులు మొదలవుతాయని భావించారు. కానీ అనూహ్యంగా శ్రీశైలం వైపు నుంచి ఉన్న ఇన్‌లెట్‌లో గత నెల 16-17 తేదీల్లో పనులు మొదలయ్యాయి. బేరింగు, ఇతర సామగ్రి ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేకపోవడం.. దీంతో అవుట్లెట్ పనులు మొదలయ్యేలా కనిపించకపోవడంతో.. ఎస్ఎల్బీసీ పనుల్లో ఎలాగైనా పురోగతి చూపించాలని జేపీ కంపెనీ ఇన్లెట్ నుంచి పనులు మొదలు పెట్టిందని తెలుస్తున్నది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… శ్రీశైలం నుంచి ఇన్లెట్ సొరంగంలో 13.670 కిలోమీటరు వద్ద రాతిపొరల్లో పెద్ద ఎత్తున సందులు ఉండటం, వాటి ద్వారా భారీ ఎత్తున నీళ్లు రావడంతో పాటు వదులుగా ఉన్న మట్టి ఉన్నట్లుగా గతంలోనే గుర్తించారు. దీనిపై అధ్యయనం చేసిన తర్వాత ఎనిమిది మీటర్ల మేర షియర్ జోన్ ఉన్నట్లుగా వెల్లడైంది. దీంతో సమస్యను అధిగమించేందుకు సుదీర్ఘ కాలం మేదో మథనం కొనసాగింది. ఈ క్రమంలో అక్కడ వస్తున్న ఊట నీటిని గ్రౌటింగ్ ద్వారా నియంత్రించడం, నిర్ణీత పరిమాణంలో వచ్చే నీటిని పూర్తిస్థాయిలో కేసింగ్‌ల ద్వారా దిగువకు మళ్లించాలని నిర్ణయించారు. అయితే, ఈ పనులు ఇంకా పూర్తి కాలేదని తెలిసింది.
కొన్నినెలల కిందట నీటిపారుదల శాఖ నిర్వహించిన సమీక్షలోనూ కేసింగ్‌లు ఏర్పాటు చేసి ఊట నీటిని మళ్లించాల్సి ఉందని పేర్కొనట్లు తెలిసింది. దీంతో ఊట నీటి నియంత్రణ కోసం రాతి పొరల మధ్య ఉన్న సందుల్లోకి సిమెంటును జొప్పించి గ్రౌటింగ్ ప్రక్రియ చేపడతారు. ఇందులో భాగంగా ఎనిమిది మీటర్ల షియర్ జోన్లో మూడు లక్షల క్యూబిక్ మీటర్ల సిమెంట్‌తో గ్రౌటింగ్ చేపట్టినట్లు చెబుతున్నారు. ఇందులో రసాయనాలు కూడా వాడాల్సి ఉన్నందున ఘటన జరిగిన తర్వాత చివరి 40 మీటర్ల పరిధిలో మట్టి గడ్డకట్టి పోయినట్లుగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే జేపీ కంపెనీ కేవలం గ్రౌటింగ్కే పరిమితమై, ఊట నీటి మళ్లింపుతో పాటు ఇతర జాగ్రత్త చర్యలను విస్మరించిందనే ఆరోపణలు ఉన్నాయి. అవే సొరంగం కుప్పకూలేందుకు దారి తీశాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
పైకప్పు కూలడం వెనక సాంకేతిక కారణాలు, బాధ్యుల అంశాలు ఎలా ఉన్నా… సరైన రీతిలో షియర్ జోన్ ట్రీట్మెంట్ జరగలేదనే సంకేతాలు ముందుగానే వెలువడినా ఎందుకు నిర్లక్ష్యం చేశారనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. ‘సొరంగంలోకి వచ్చి, పోతున్న సమయంలో పైనుంచి మట్టి పడుతున్నది… నీళ్లు పడుతున్నాయి. అధికారులు కూడా చూశారు. కానీ వాళ్లకు పని కావాలి కదా… అందుకే అట్లనే పని చేయించారు. ఈరోజు ఒక్కసారిగా మట్టిపెడ్డలు, నీళ్లు పెద్ద ఎత్తున పడ్డాయి. ఆ వెంటనే రింగు (సిమెంటు సెగ్మెంట్లు అమర్చినది) కింద పడ్డది. ఆతర్వాత పైనుంచి లూజుగా ఉన్న మట్టితో పాటు పెద్ద ఎత్తున నీళ్లు వచ్చాయి…’ అని సంఘటన జరిగిన రోజు అందులో నుంచి బయటపడిన కార్మికుడు చెప్పిన మాటలివి. అంటే షియర్ జోన్ ట్రీట్మెంట్ చర్యలు సరిగ్గా జరుగలేదని, అందుకే సొరంగం పైకప్పు నుంచి రెండు, మూడు రోజులుగా మట్టి, నీళ్లు పడుతున్నాయని అర్థం చేసుకోవచ్చు.
దీనిని కార్మికులు, ఇంజినీర్లు గుర్తించినా నిర్లక్ష్యం వహించారని సదరు కార్మికుడి మాటల ద్వారానే స్పష్టమవుతుంది. కనీసం మట్టి, నీళ్లు పడుతున్న వాస్తవాన్ని ఆదిలోనే గుర్తించినపుడు.. అప్రమత్తమై పనులు నిలిపివేసి ఉంటే ఎనిమిది మంది నిండు ప్రాణాలైనా దక్కేవి. పైగా అధికారులకు తెలిసినా పట్టించుకోలేదని, వాళ్లకు పని కావాలి కదా… అని కార్మికుడు ఆవేదనతో చెప్పాడంటే 15 నెలలైనా మొదలుకాని ఎస్ఎల్బీసీ పనుల్లో పురోగతిని గొప్పగా చూయించుకోవడానికి పడిన తాపత్రయం… తద్వారా వహించిన నిర్లక్ష్యమే సొరంగ ప్రమాదంలో ఎనిమిది కుటుంబాలను ముంచిందని స్పష్టమవుతుంది.
షియర్ జోన్లు వచ్చినపుడు జాతీయ, అంతర్జాతీయ నిపుణులు రప్పించి అధ్యయనం చేసి, ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై రూట్‌మ్యాప్ (డిజైన్లు) రూపొందిస్తారు. ఈపీసీ విధానమైనందున ఈ ప్రక్రియలన్నింటినీ నిర్మాణ సంస్థనే పూర్తి చే స్తుంది. చివరకు నీటిపారుదల శాఖ పరిధిలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) వాటన్నింటినీ పరిశీలించి అనుమతి ఇచ్చిన తర్వాతనే నిర్మాణ సంస్థ పనులు చేపట్టాల్సి ఉం టుంది. శాఖ ఇంజినీర్లు ఆ పనులను పర్యవేక్షించాలి. పనులు పూర్తయిన తర్వాత సంతృప్తికరంగా ఉన్నాయని జియాలజీ, ఇంజినీరింగ్ నిపుణులు ధృవీకరించాలి. మరి… ఎస్ఎల్బీసీ షియర్ జోన్ విషయంలో ఇవన్నీ జరిగాయా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
సాధారణ రాతి పొరలకు భిన్నంగా ఎస్‌ఎల్‌బీసీలోని రాతి పొరలు ఉన్నాయి. ఈ రాతి పొరల మధ్య ఉన్న సందుల నుంచి నీటి ఊటలు భారీగా వస్తున్నట్టు గుర్తించారు. ఈ ఊటల నుంచి నిమిషానికి నీరు ఎంతమేర ఉబికి వస్తుందనేది ముందుగా లెక్కించాలి. ఆ తర్వాత ఆ నీటిని మళ్లించే పనులు చేపట్టాలి. ఆ తర్వాత ఊటను నియంత్రించేందుకు గ్రౌటింగ్ (రంధ్రాలు చేసి అందులో కాంక్రీట్‌ను జొప్పించడం) చేయాలి. అది జరిగిందా? లేదా?? అనేది తెలియదు.
గ్రౌటింగ్ తర్వాత పైకప్పు నుంచి నీళ్లు పడకుండా వచ్చే నీటి ఊటను మళ్లించేందుకు కేసింగ్ పైపులను ఏర్పాటు చేసి… నీళ్లు దిగువకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలి. అయితే సొరంగంలో ఈ వ్యవస్థ ఏర్పాటు చేశారా? లేదా? అనేది ప్రశ్నార్ధకమే.
సొరంగ నిర్మాణంలో డ్రిల్లింగ్ పూర్తయిన వెంటనే టీబీఎంలోని వెనక వైపు స్టీల్ రింగులు వేసి, సిమెంటు సెగ్మెంట్లను అమర్చుతారు. తద్వారా సొరంగం పైనుంచిగానీ, పక్కల నుంచిగానీ మట్టి, రాళ్లు పడకుండా ఇవి అదిమి పడతాయి. ఇదంతా సాంకేతిక ప్రమాణాల మేరకు ఉంటుంది. అయితే షియర్ జోన్లో భూపొరలు వదులుగా ఉన్నందు వల్ల ఎగువన ఉన్న మట్టి, రాళ్లతో పాటు గ్రౌటింగ్ చేయడం ద్వారా అందులోకి వెళ్లిన సిమెంట్ పరిమాణాన్ని కూడా లెక్కించి లోడ్‌కు అనుగుణంగా రింగులు, సిమెంటు సెగ్మెంట్లను అమర్చాలి. ఇతర ప్రాజెక్టుల్లో ఇలాంటి సమస్య వచ్చినపుడు లోడ్‌ను భరించేందుకు ఆ జోన్ వరకు స్లాబ్‌లు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఎస్ఎల్బీసీ సొరంగంలో లోడ్‌కు అనుగుణంగా రింగులు వేశారా? లేదా? అనేది తెలియదు.
రాతి పొర అమరికలో తేడాలు, నీటితో కూడిన మట్టి, ఊట నీరు ఉబికివచ్చే చోటును సాధారణంగా షియర్ జోన్ అంటారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో ఎనిమిది మీటర్ల మేర ఈ షియర్ జోన్ ఉన్నట్టు గుర్తించారు. అక్కడే ప్రమాదం జరిగింది. అయితే సొరంగం తవ్వకాల్లో షియర్ జోన్‌ను గుర్తిస్తే సాధారణంగా ఎలాంటి చర్యలు చేపడతారనే దానిపై రిటైర్డ్ జియాలజీ నిపుణులు, రిటైర్డ్ ఎస్ఈలు పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకాల్లో ఈ జాగ్రత్తలను ఏజెన్సీ, ప్రభుత్వ నిపుణులు పాటించారా? లేదా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఒకవేళ రింగులు, సిమెంటు సెగ్మెంట్ల ఎగువన ఏమైనా సందులు ఉంటే అవి లేకుండా చర్యలు తీసుకోవాలి.
ఇవన్నీ చేసిన తర్వాత తిరిగి జియాలజీ, ఇంజినీరింగ్ నిపుణులతో పరీక్షలు చేయించి… షియర్ జోన్లో చేపట్టిన చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయా? లేదా? అనేది తెలుసుకోవాలి.
ఈపీసీ విధానమైనందున నిర్మాణ సంస్థ ఈ డిజైన్లు రూపొందించి, చర్యలు తీసుకుని, పరీక్షలు చేయిస్తుంది. అదే సమయంలో వాటిని నీటిపారుదల శాఖలోని సీడీవో (సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్) కూడా పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేస్తేనే నిర్మాణ సంస్థ సొరంగం పనులు చేపట్టాలి. అప్పుడే పనులను ముందుకు కొనసాగించాలి. ఎస్ఎల్బీసీ విషయంలో ఇవన్నీ నిబంధనలకు అనుగుణంగా జరిగాయా? లేదా? అనేది తెలియదు.
ఏదైనా పైకప్పు కూలడమంటే బరువును మోయలేకనే కూలుతుందనేది అందరికీ తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో ఘటన జరిగినపుడు ఎనిమిది మీటర్ల షియర్ జోన్లో తొలుత రెండు సెగ్మెంట్లు (మూడు మీటర్లు) కూలాయని కార్మికులు చెబుతున్నారు. డ్రిల్లింగ్ తర్వాత అమర్చిన స్టీల్ రింగులు, సిమెంటు సెగ్మెంట్లు పైన ఉన్న భూమి పొరల బరువును మోయలేక కుప్పకూలిపోయాయి. అంటే షియర్ జోన్‌కు సంబంధించిన ట్రీట్మెంట్ (చేపట్టాల్సిన చర్యలపై డిజైన్, లోడ్ లెక్కింపు) అంచనాలు (స్ట్రక్చరల్) సరిగా లేవా? లేక డిజైన్, లోడ్ లెక్కింపునకు అనుగుణంగా చర్యలు (కన్స్ట్రక్షన్)జరుగలేదా? అనేది తెలియట్లేదు. లేక రెండింటిలోనూ లోపాలు జరిగాయా? అని నిపుణులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ధృవీకరించిన తర్వాతే సొరంగం పనులు మొదలుపెట్టామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. దీని ప్రకారం ట్రీట్మెంట్కు సంబంధించిన డిజైన్లను సీడీవో అనుమతించడంతో పాటు ఇంజినీర్లు ట్రీట్మెంట్ పనులను పర్యవేక్షించారనేది సుస్పష్టం. అయినప్పటికీ ‘స్ట్రక్చరల్, కన్స్ట్రక్షన్ ఫెయిల్యూర్’ కారణంగా పైకప్పు కూలిందంటే డిజైన్ల లోపమా? లోడ్ లెక్కింపులో అంచనా తప్పిందా? చివరకు జీఎస్ఐ ధృవీకరణ గతి తప్పిందా? అనేవి విచారణలో తేలాల్సిన అంశాలు.