హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): జాతీయ చిన్నతరహా పరిశ్రమల కార్పొరేషన్ (ఎన్ఎస్ఐసీ) సహకారంతో వచ్చే 3-4 ఏండ్లలో 50వేల మంది యువతకు వివిధ విభాగాల్లో నైపుణ్య శిక్షణను అందిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. ఎన్ఎస్ఐసీ, తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖల మధ్య నైపుణ్య శిక్షణకు సంబంధించి బుధవారం సచివాలయంలో ఓ అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నైపుణ్యాభివృద్ధి వల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మెరుగైన మానవ వనరులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇక ఈ ఒప్పందంతో ముడి సరుకు కొనుగోలు, ఉత్పత్తుల విక్రయాల్లో చిన్న పరిశ్రమలకు ఎన్ఎస్ఐసీ సహకరిస్తుందని వివరించారు.
జాతీయ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడంలోనూ కృషి చేస్తుందన్నారు. అత్యధిక ఉపాధి అవకాశాలను చిన్న పరిశ్రమల ద్వారానే పెంపొందించడం సాధ్యమవుతుందని, అందుకే తమ ప్రభుత్వం వాటి వృద్ధి, విస్తరణల కోసం పాటుపడుతున్నదని చెప్పుకొచ్చారు. కాగా, జిల్లా స్థాయిలో నైపుణ్యాభివృద్ధిపట్ల ఎకువ దృష్టి కేంద్రీకరిస్తామని మంత్రి తెలిపారు. దీని కోసం తేజస్ (తెలంగాణ ఎంటర్‌ప్రెన్యూర్స్ జర్నీ ఫర్ యాస్పిరేషన్స్ అండ్ అచీవింగ్ సక్సెస్) పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు వెల్లడించారు. ఎన్ఎస్ఐసీ చైర్మన్ సుభ్రాంశు శేఖర్ ఆచార్య, తెలంగాణ పరిశ్రమల శాఖ కమిషనర్ మల్సూర్, టీ-వర్స్ సీఈవో జోగిందర్ తనికెళ్ల, తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈవో శ్రీకాంత్ నాగప్ప తదితరులు ఈ ఎంవోయూ కార్యక్రమంలో పాల్గొన్నారు.