Telangana Minister Sridhar Babu | విద్యార్థులు, నిరుద్యోగ యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ‘టీ వర్క్స్’, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ‘స్కిల్ స్ప్రింట్’ పేరిట ప్రత్యేక ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఈ విషయమై రూపొందించిన పోస్టర్ను ఆయన గురువారం ఆవిష్కరించారు. ‘తెలంగాణను నైపుణ్య మానవ వనరులకు కేరాఫ్ అడ్రస్ గా మారుస్తాం. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర యువతలో ఉద్యోగ నైపుణ్యాల పెంపుదలకు కృషి చేస్తున్నాం’ అని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ‘స్కిల్ స్ప్రింట్’కింద 90 రోజులపాటు ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం ఉంటుంది.
‘స్కిల్ స్ప్రింట్’ కార్యక్రమంలో భాగంగా ఇంజినీరింగ్, రోబోటిక్స్, మేనేజ్ మెంట్, సేల్స్, బిజినెస్ డెవలెప్ మెంట్, మార్కెటింగ్ తదితర రంగాల్లో డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం. సంబంధిత పరిశ్రమల నిపుణులు మార్గనిర్దేశం (మెంటార్ షిప్) చేస్తారు. టీ – వర్క్స్ లోని అధునాతన సౌకర్యాలను విద్యార్థులు వినియోగించుకోవచ్చు. సొంతంగా ప్రాజెక్టులను రూపొందించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తాం. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా అకాడమిక్ క్రెడిట్స్ ఇస్తాం’ అని తెలిపారు. ఆసక్తి గల కళాశాలలు, విద్యార్థులు టీ – వర్క్స్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. Yisu.in వెబ్ సైట్లో కూడా వివరాలు దొరుకుతాయి. ఈ కార్యక్రమంలో టీ- వర్క్స్ సీఈవో తనికెళ్ల జోగిందర్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఇంఛార్జి రిజిస్ర్టార్ ఛమాన్ మెహతా పాల్గొన్నారు.