హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ): టీఎస్ఎస్పీడీసీఎల్ జూనియర్ లైన్మెన్ పరీక్షల్లో పాస్ చేయిస్తామని నమ్మించి రూ.లక్షలు వసూలు చేసిన ముఠాలో విద్యుత్తుశాఖ అధికారులే కీలక నిందితులని రాచకొండ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించిన పోలీసులు మంగళవారం ఐదుగురిని అరెస్టు చేశారు. ఇందులో ఇద్దరు ఏడీఈ స్థాయి అధికారులు ఉండగా, మరొకరు సబ్‌ఇంజినీర్ హోదాలో ఉన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమల్లకు చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ చెన్నగాని శివప్రసాద్ ఈ నెల 17న నిర్వహించిన జూనియర్ లైన్మెన్ పరీక్షలకు హాజరయ్యాడు. అదే గ్రామానికి చెందిన యువతి బీ నవ్య, సయ్యద్ ఖలీమ్ఉల్లా కలిసి పరీక్ష రాస్తున్నప్పుడు సెల్‌ఫోన్‌కు అన్ని ఆన్సర్లు పంపిస్తామని రూ.5 లక్షలకు బేరం కుదుర్చుకొన్నారు. వారు చెప్పిన ప్రకారం.. శివప్రసాద్ పరీక్ష హాల్లోకి తన కట్డ్రాయర్లో సెల్‌ఫోన్ పెట్టుకొని వెళ్లాడు.
ఇది గమనించిన పరీక్షా కేంద్రం నిర్వాహకులు ఫిర్యాదు చేయడంతో ఘట్కేసర్ పోలీసులు శివప్రసాద్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరపడంతో పలువురు విద్యుత్తుశాఖ అధికారుల పాత్ర బయటపడింది. అంబర్‌పేటకు చెందిన టీఎస్ఎస్పీడీసీఎల్ ఏడీఈ మహ్మద్ ఫిరోజ్‌ఖాన్, ట్రాన్స్‌కో ఏడీఈ మంగళగిరి సైదులు, టీఎస్ఎస్పీడీసీఎల్ సబ్ ఇంజినీర్ షేక్సాజన్ మొత్తం కథ నడిపినట్టు తేలింది. దీంతో వారందరీని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు మహ్మద్ ఫిరోజ్‌ఖాన్‌ను హైదరాబాద్ పోలీసులు, మిగతా ఐదుగురిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. టీఎస్ఎస్పీడీసీఎల్ ఏడీఈ మహ్మద్ ఫిరోజ్‌ఖాన్ 50 ప్రశ్నలకు, ట్రాన్స్‌కో ఏడీఈ మంగళగిరి సైదులు 20 ప్రశ్నలకు, టీఎస్ఎన్పీడీసీఎల్ సబ్‌ఇంజినీర్ షేక్సాజన్ మరో 10 ప్రశ్నలకు జవాబులు రాసిస్తే వాటిని నవ్య అభ్యర్థులకు పంపించేలా ఒప్పం దం చేసుకొన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. వీరు ఇంకా ఎంతమంది అభ్యర్థులతో ఇలా ఒప్పందం చేసుకొన్నారనే విషయం తేలాల్సి ఉన్నది. ఈ ముఠా బాగోతాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన పోలీసు అధికారులను సీపీ మహేశ్‌భగవత్ అభినందించారు.