భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 26 (నమస్తే తెలంగాణ): భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం బుధవారం కుప్పకూలింది. శిథిలాల్లో మేస్త్రీలు, కూలీలు చిక్కుకుపోవడం ఘటన తీవ్రతను మరింత పెంచింది. భద్రాచలం పట్టణంలోని రామాలయం సమీపంలో ఓ పాత భవనంపై శ్రీపతి నేషనల్ సేవా ట్రస్టు పేరిట మరో ఐదంతస్తులు నిర్మిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం కూడా పనులు కొనసాగుతుండగా, భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాల్లో ఎంతమంది చిక్కుకున్నారనే విషయం మాత్రం తేలడం లేదు. మరోవైపు ఇద్దరు మాత్రమే పనుల్లో ఉన్నట్టు భవన యజమాని, అధికారులు చెప్తున్నారు. భద్రాచలానికి చెందిన పడిశాల ఉపేందర్‌రావు, చల్లా కామేశ్‌తో పాటు మరికొందరు పనుల్లో ఉన్నట్టు స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు. ఈ క్రమంలో కొన్ని అరుపులు వినిపించినట్టు స్థానికులు వెల్లడించారు. భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు, ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, స్థానిక అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆరు జేసీబీలు, భారీ క్రేన్లతో ఐరన్ కట్టర్లను ఉపయోగించి రెస్క్యూ బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి. భవనం కూలిందనే విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలి వద్ద గుమిగూడారు. నిర్మాణం నాసిరకంగా ఉండటమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్తున్నారు. కాగా ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలంలో పాతభవనంపై ఐదంతస్తుల నిర్మాణం చేపడితే అధికారులెందుకు పట్టించుకోలేదనే ప్రశ్న తలెత్తుతున్నది. ఈ భవనంపై ఇటీవలే గిరిజన సంఘాలు అధికారులకు ఫిర్యాదు చేశాయి. ఇంతలోనే ప్రమాదం జరిగింది.
నా పేరు కామేశ్.. నన్ను కాపాడండి
కూలిపోయిన భవనం శిథిలాల నుంచి ఓ వ్యక్తి ఆర్తనాదాలు రెస్క్యూ, ఫైర్ సిబ్బందికి వినిపించాయి. ‘నా పేరు కామేశ్.. నన్ను కాపాడండి’ అంటూ అరిచినట్టు వినిపించింది. దీంతో ఆ వ్యక్తిని కాపాడేందుకు లైట్ల వెలుతురు మధ్య పైపుల ద్వారా ఆక్సిజన్, ఓఆర్ఎస్ ప్యాకెట్లను సైతం పంపించారు.