ఆరు నెలలకో అధికారి!
రాష్ట్రంలో కీలకమైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ (పీఆర్ఆర్డీ)లో కుర్చీలాట కొనసాగుతున్నది. ఈ శాఖ బాస్‌లు ఆరు నెలలకు ఒకరు చొప్పున మారుతున్నారు.
- పీఆర్ఆర్డీలో మూడేండ్లలో ఆరుగురు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు బదిలీ
- తరచూ అధికారుల మార్పుతో కుంటుపడుతున్న పాలన.. గ్రామీణాభివృద్ధిపై తీవ్ర ప్రభావం
- తాజాగా నవీన్ మిట్టల్ నియామకంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశం
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కీలకమైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ (పీఆర్ఆర్డీ)లో కుర్చీలాట కొనసాగుతున్నది. ఈ శాఖ బాస్‌లు ఆరు నెలలకు ఒకరు చొప్పున మారుతున్నారు. మూడేండ్లలో ఆరుగురు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు బదిలీ అయ్యారు. వరుసగా అధికారులు మారుతుండటంతో శాఖలో స్థిరత్వం కొరవడుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒక శాఖకు అధిపతిగా బాధ్యతలు చేపట్టిన అధికారి ఆ శాఖపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవడానికి, క్షేత్రస్థాయి సమస్యలను అర్థం చేసుకోవడానికి, ప్రాధాన్యాలను నిర్ధారించుకుని కార్యాచరణ రూపొందించడానికి కొంత సమయం పడుతుంది. కానీ, పీఆర్ఆర్డీ శాఖలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేండ్లలోనే ఈ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయిలో ఆరుగురు అధికారులు మారడం అధికార యంత్రాంగంలో తీవ్ర చర్చకు దారితీస్తున్నది.
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొత్తలో పీఆర్ఆర్డీశాఖ ప్రధాన కార్యదర్శిగా సందీప్‌కుమార్ సుల్తానియా ఉండగా, ఆ తర్వాత లోకేశ్‌కుమార్, ఎన్ శ్రీధర్, సంజయ్‌కుమార్, దానకిశోర్ పనిచేశారు. తాజాగా నవీన్‌మిట్టల్ ఆ బాధ్యతలు చేపడుతున్నారు. ఇప్పటివరకు ఈ శాఖ కమిషనర్లుగా హనుమంతరావు, అనితా రామచంద్రన్, సృజన, శృతి ఓజా పనిచేశారు. ప్రస్తుతం దివ్యాదేవరాజన్ కొనసాగుతున్నారు. సగటున ఆరు నెలలకో అధికారి చొప్పున బదిలీ అవుతుండటంతో శాఖకు దిశానిర్దేశం చేసేవారెవరు? దీర్ఘకాలిక ప్రణాళికలను అమలు చేసేవారెవరు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పట్టు సాధించేలోపే బదిలీ
పీఆర్ఆర్డీ శాఖ పరిధి చాలా విస్తృతమైనది. గ్రామపంచాయతీల పరిపాలన, గ్రామీణ మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, ఉపాధి హామీ పథకం, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సంస్థల బలోపేతం వంటి కీలక బాధ్యతలు ఈ శాఖపై ఉన్నాయి. వేలాది గ్రామపంచాయతీలు, లక్షలాది మంది ప్రజల అవసరాలతో ముడిపడిన ఈ శాఖను సమర్థంగా నడిపించాలంటే అధికారికి క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహనతోపాటు దీర్ఘకాలిక దృష్టి అవసరం.
అయితే ఆ దిశగా పని ప్రారంభించేలోపే అధికారి మారిపోతుండటంతో కొత్తగా వచ్చే అధికారి మళ్లీ మొదటి నుంచి పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.ప్రభుత్వానికి అధికారులను బదిలీ చేసే అధికారం ఉన్నప్పటికీ, ప్రతి బదిలీ వెనుక పాలనా ప్రయోజనం ఉండాలి. సమర్థత, ప్రజాప్రయోజనం, పరిపాలనా అవసరాలే ప్రాతిపదిక కావాలి. కేవలం పోస్టుల మార్పులతో పాలనలో వేగం పెరుగదు. కీలక శాఖల బాధ్యతలు అప్పగించిన అధికారులకు తగినంత సమయం, స్వేచ్ఛ, స్థిరత్వం కల్పించినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయి.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో నేరుగా సంబంధం ఉన్న పీఆర్ఆర్డీ వంటి శాఖలో తరచూ నాయకత్వ మార్పులు జరుగడం సమర్థ పాలనకు అనుకూలం కాదు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఇంత దారుణంగా బదిలీలు జరుగలేదు. అయితే ఇప్పుడు ఆరుగురు అధికారులు మారడానికి దారితీసిన పరిపాలనా కారణాలేంది? ప్రతి బదిలీతో శాఖకు కలిగిన ప్రయోజనం ఏమిటి? గత అధికారులు చేపట్టిన కార్యక్రమాల పురోగతిని ప్రభుత్వం సమీక్షించిందా? అనే ప్రశ్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

