హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఏపీ హైకోర్టులకు కొత్తగా ఆరుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. వీరిలో నలుగురిని తెలంగాణ హైకోర్టులో, ఇద్దరిని ఏపీ హైకోర్టులో నియమించారు. వీరంతా జ్యుడీషియల్ సర్వీస్‌లో ఉన్న న్యాయాధికారులే. వీరిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల 11న కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. తదనుగుణంగా కేంద్రం పంపిన నివేదికకు రాష్ట్రపతి బుధవారం ఆమోదముద్ర వేశారు.
దీంతో కేంద్ర న్యాయశాఖ రెండు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా జిల్లా జడ్జీల కోటాలో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి రేణుక యారా, సిటీ సివిల్ స్మాల్‌కాజెస్ కోర్టు చీఫ్ జడ్జి నందికొండ నర్సింగ్‌రావు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎడ తిరుమలాదేవి, హైకోర్టు పరిపాలన విభాగం రిజిస్ట్రార్ బొబ్బిలి రామయ్య మధుసూదన్‌రావు నియమితులయ్యారు.
ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా ఆ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ అవధానం హరిహరనాథశర్మ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావును నియమించారు. వీరంతా ఈ వారంలోనే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నది. తెలంగాణ హైకోర్టుకు నియమితులైన నలుగురు న్యాయమూర్తులు ఈ నెల 25న మొదటి కోర్టు హాల్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో తాతాలిక ప్రధాన న్యాయమూర్తితో కలిపి 26 మంది జడ్జీలు ఉన్నారు. కొత్తవారు ప్రమాణ స్వీకారం చేస్తే ఆ సంఖ్య 30కి పెరుగనున్నది.
సంగారెడ్డికి చెందిన ఎడ తిరుమలాదేవి 1964 జూన్ 2న జన్మించారు. హైదరాబాద్‌లోనే చదివారు. లా పూర్తిచేశాక హైకోర్టుతోపాటు జిల్లా కోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. 2012లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. నిజామాబాద్, ఖమ్మం, వరంగల్‌లో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా పనిచేశారు. అనంతరం హైకోర్టు రిజిస్ట్రార్‌గా, తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేసిన ఆమె.. ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ఖాజీపేటలో ఎల్లయ్య, అనసూయ దంపతులకు 1969 మే 25న జన్మించిన మధుసూదన్‌రావు.. రైల్వే హైసూల్లో పాఠశాల విద్య, కాకతీయ యూనివర్శిటీలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తిచేసి, 1999లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2012 డిసెంబర్లో జిల్లా జడ్జిగా ఎంపికై నెల్లూరు, చిత్తూరు, మేడ్చల్ మలాజిగిరి కోర్టుల్లో పనిచేయడంతోపాటు సీబీఐ కోర్టు ప్రధాన జడ్జిగా, వ్యాట్ జ్యుడీషియల్ సభ్యునిగా, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శిగా సేవలందించారు. ప్రస్తుతం హైకోర్టు పరిపాలనా విభాగం రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు.
అవధానం రామచంద్రయ్య, సుబ్బమ్మ దంపతులకు 1968 ఏప్రిల్ 16న జన్మించిన హరిహరనాథశర్మ స్వస్థలం కర్నూలు. కర్నూలులోని ఉస్మానియా కళాశాలలో బీఎస్సీ, నెల్లూరులోని వీఆర్ న్యాయ కళాశాలలో లా పూర్తిచేసిన శర్మ.. 994లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యాక కర్నూలు జిల్లా కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. తొలుత సీనియర్ న్యాయవాది రామకృష్ణారావు వద్ద జూనియర్‌గా పనిచేశాక 1998లో సొంతగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. 2007 అక్టోబర్‌లో జిల్లా జడ్జిగా ఎంపికై ఉమ్మడి ఏపీలోని పలు జిల్లాల్లో పనిచేశారు. 2017-18లో అనంతరపురం, 2020-22లో విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి (పీడీజే)గా సేవలందించి 2022లో హైకోర్టు రిజిస్ట్రార్‌గా చేశారు. 2023 నుంచి ఏపీ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కనిగిరికి చెందిన డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు 1975 ఆగస్టు 3న వెంకటేశ్వర్లు, పద్మావతి దంపతులకు జన్మించారు. ఆయన ప్రాథమిక విద్య ప్రకాశం జిల్లాలో కొనసాగింది. నెల్లూరు వీఆర్ న్యాయ కళాశాలలో లా చేశారు. 2000 సంవత్సరంలో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యాక నాటి ఉమ్మడి ప్రకాశం జిల్లాతోపాటు నెల్లూరు, కావలిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. జిల్లా జడ్జి పోస్టులకు నిర్వహించిన పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ సాధించి 2014లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ఏలూరులో అదనపు జిల్లా జడ్జిగా సేవలందించారు. ఉమ్మడి ఏపీలోని పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. 2021లో హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)గా నియమితులైన ఆయన.. ఆ తర్వాత నుంచి రిజిస్ట్రార్ జనరల్‌గా కొనసాగుతున్నారు.
హైదరాబాద్ చెందిన నందికొండ పెంటయ్య, మణెమ్మ దంపతులకు 1969 మే 3న జన్మించిన నర్సింగ్‌రావు హైదరాబాద్‌లో పాఠశాల, కళాశాల విద్యాభ్యాసాన్ని పూర్తిచేశారు. 1995లో సీఎంఆర్ కాలేజీలో లా పూర్తిచేసి, అదే ఏడాది న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2012లో నేరుగా జిల్లా జడ్జిగా ఎంపికై విశాఖపట్నం అదనపు జిల్లా జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. జ్యుడిషియల్ అకాడమీలో గుంటూరు, వరంగల్, ఎల్బీనగర్, సైబరాబాద్ ఎంఎస్ఐగా, న్యాయశాఖ కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం హైకోర్టు జ్యుడీషియల్ ఇన్ఫ్రా రిజిస్ట్రార్‌గా, ప్రస్తుతం సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఐలయ్య, నాగమణి దంపతులకు 1973 జూన్ 14న జన్మించిన రేణుక యారా.. హైదరాబాద్‌లోనే పాఠశాల విద్య అభ్యసించారు. 1998లో బషీర్‌బాగ్‌లోని పీజీ లా కాలేజీలో ఎల్ఎల్బీ పూర్తిచేశాక ఫిలడెల్ఫియా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్ఎం చేశారు. 1998లో రాష్ట్ర బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకుని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2012 డిసెంబర్లో జిల్లా జడ్జిగా ఎంపికై వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో పనిచేయడంతోపాటు వ్యాట్ ట్రిబ్యునల్ జ్యుడీషియల్ సభ్యురాలిగా పనిచేశారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శిగా, సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా సేవలందించారు.