Telangana | న్యూఢిల్లీ, జనవరి 13 (నమస్తే తెలంగాణ): దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక ప్రభుత్వం తమ అంతర్గత రాజకీయాల కంపులోకి ఐఏఎస్‌లను.. అందునా మహిళా ఐఏఎస్‌లను లాగి వారిని మనోవేదనకు గురి చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. తెలుగు రాష్ర్టాలతో సంబంధం ఉండి ప్రస్తుతం ఇక్కడ ఉన్న పలువురు ఐఏఎస్‌లు తెలంగాణ పరిణామాలపై ఆరాతీసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు తెరవెనుక జరిగిన పరిణామాలు సైతం ప్రస్తావనకు వస్తున్నాయి.
ప్రధానంగా ‘ముఖ్య’నేత ఎందుకు ‘టార్గెట్ మినిస్టర్’ ఆపరేషన్ చేప్టటారు? ఆపై ఇద్దరి మధ్య ఏర్పడిన గ్యాప్.. అది మరింత పెరిగిన తీరుపై చర్చించుకుంటున్నారు. సదరు ‘ముఖ్య’నేత ఆపరేషన్ బూమరాంగ్ కావడం.. దిద్దుబాటు చర్యలకు పూనుకోవడంతో పాటు హస్తిన పెద్దలు ఈ పరిణామాలపై నిలదీస్తే ఏం చెప్పాలనే దానిపైనా మల్లగుల్లాలు పడుతున్నారని బ్యూరోక్రాట్లలో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా తెలంగాణలోని ఐఏఎస్‌లనే కాదు.. దేశవ్యాప్తంగానూ ఆ సర్కిళ్లను కలవరపాటుకు గురిచేసిన ఈ పరిణామాల వెనుక మంత్రివర్గ విస్తరణ మొదలు సినిమా టికెట్ల రేట్ల పెంపు వరకు రగులుకున్న చిచ్చు కారణమైందని చెప్పుకొంటున్నారు.
టార్గెట్ మినిస్టర్..
రాజకీయాల్లో ఆట ఒకరు మొదలు పెడుతా రు. కానీ మధ్యలోకి ఎవరెవరు వస్తారో? ఎంతమంది రిటైర్డ్ హర్ట్‌గా పక్కకు తప్పుకొంటారో? మొదలుపెట్టిన వారికి సైతం అంతుబట్టదు. పరిణామాలు ఎదురుతన్నితే.. గెలిచేందుకు ఆట మొదలుపెట్టిన వారే చివరికి ‘టై‘గా ముగించేందుకు నానా తంటాలు పడాల్సి వ స్తుంది. నాలుగు గోడల మధ్య అనేకమంది గడ్డాలు పట్టుకొని బతిమిలాడాల్సి వస్తుంది. రాష్ట్రంలో ‘ముఖ్య’నేత మొదలుపెట్టిన ‘టార్గెట్ మినిస్టర్’ ఆటలో కొన్నిరోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు.. ఇదేరీతిన కనిపిస్తున్నాయి.
మంత్రివర్గ విస్తరణలో భాగంగా కూడికలు.. తీసివేతలపై అటు హస్తిన పెద్దలు, ఇటు ‘ముఖ్య’నేతకు పొంతన కుదరలేదనేది బహిరంగ రహస్యం. ఢిల్లీస్థాయిలో అనేక దఫాలుగా జరిగిన చర్చలు సదరు ‘ముఖ్య’నేత నాలుగు మెట్లు దిగడం, ఒక మెట్టు ఎక్కడం అన్నట్టుగా ముగిశాయి. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవి కోసం చాలారోజులుగా పట్టుబడుతున్నా రు. ఏఐసీసీ పెద్దలను కలిసి ‘మీరిచ్చిన హామీనే’ అని గుర్తుచేశారు. ‘ముఖ్య’నేతపైనా తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఇందులో భాగంగా బహిరంగంగా తన నోటికి కూడా పని చెప్పారు.
రాజగోపాల్‌రెడ్డిని కట్టడి చేసేందుకు ‘ముఖ్య’నేత పలు మార్గాల్లో ప్రయత్నించినట్టు పార్టీ నేతలే చెప్పుకొస్తున్నారు. ఆ కోవలోనే తనకు నమ్మిన బంట్లుగా ఉండే పలువురు ఎంపీలతో నేరుగా రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేయించిన ట్టు సమాచారం. ‘ముఖ్య’నేత స్థాయిని కూడా మరచి రాజగోపాల్‌రెడ్డి ఇష్టానుసారంగా మా ట్లాడుతున్నారని సదరు ఎంపీలు ఫిర్యాదు చేసి ఆయనకు చెక్ పెట్టాలని ఆశించారు. కానీ అందుకు భిన్నంగా రాహుల్ నుంచి ‘మనం ఇచ్చిన హామీనే కదా! మన పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారు’ అనే వ్యాఖ్యలు వచ్చినట్టు అధికార పార్టీకి చెందిన కీలక నేత ఒకరు అప్పటి సమాచారాన్ని గుర్తుచేసుకున్నారు.
తానొకటి తలిస్తే.. హస్తిన మరోటి తలిచిందని, రాజగోపాల్‌రెడ్డికి పదవి రాకుండా నిలువరించలేమని గుర్తించిన ‘ముఖ్య’నేత రూటు మార్చినట్టు సదరు నేత పేర్కొన్నారు.
మంత్రివర్గంలో ధిక్కారం పెరుగుతుందనే!
వాస్తవానికి హస్తిన పెద్దల నుంచి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవిపై హామీ ఉన్నదనేది ఇతర ముఖ్యనేతలు సైతం ధ్రువీకరించిన సత్యం. ఈ నేపథ్యంలో ఎలాగూ ఖాళీ ఉన్నందున ఆయనకు మంత్రి పదవి ఇస్తే సరిపోతుంది. మరి.. ‘సామాజిక సమీకరణాలుంటాయి కదా?’ అని సదరు నేత ముందు ప్రస్తావిస్తే ‘రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా! కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఇలాంటి సమీకరణాలు ఎన్ని పక్కకు పెట్టలేదు!’ అని సదరు నేత కుండబద్దలు కొట్టారు.
అయితే ఇక్కడే ‘ముఖ్య’నేత ఆలోచనలు, హస్తిన పెద్దల మధ్య పొంతన కుదరలేదని వివరించారు. ‘రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వ డం వల్ల మంత్రివర్గంలో కోమటిరెడ్డి బ్రదర్స్ శకం మొదలవుతుంది. కీలకమైన నల్లగొండ జిల్లాలో మంత్రుల సంఖ్య మూడుకు చేరుకుంటుంది. గ తంలో ఆ జిల్లా రాజకీయాల్లో ‘ముఖ్య’నేత పలుమార్లు వేలు పెట్టినా చక్రం తిప్పలేకపోయారు. పార్టీ ‘పెద్దల’ను ప్రసన్నం చేసుకున్నా జిల్లా రాజకీయాలను తన వైపు మలుపుకోవడంలో సఫలీకృతం కాలేకపోయారు. పైగా ఇ ప్పుడున్న ఇద్దరు మంత్రులు తన కంటే సీనియర్లు కావడంతో వారిని నియంత్రించే పరిస్థితుల్లో లేరు. ఇదేకాకుండా రాజగోపాల్‌రెడ్డి అన్న వెంకట్‌రెడ్డి లెక్కనే నిక్కచ్చిగా మాట్లాడే నాయకు డు. ఈ క్రమంలో మంత్రివర్గంలోనూ ధిక్కారస్వరం పెరిగే ప్రమాదం ఉందనేది ‘ముఖ్య’నేత అంచనా! అందుకే ‘కూడికకు ముందు తీసివేతను అమలు చేస్తే ఎలా ఉంటుంది?’ అనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ‘టార్గెట్ మినిస్టర్’ ఆపరేషన్’ అని ఆ నేత విశ్లేషించారు.
తొలిసారిగా విష సంస్కృతికి బీజం
కాంగ్రెస్‌లో కొందరు నేతలు ఆడే రాజకీ య ఆట చాలా ప్రమాదకరంగా ఉంటుందని కీలక నేత ఉమ్మడి రాష్ట్రంలో సీఎం కుర్చీలాట కోసం మత ఘర్షణలు పెట్టిన చిచ్చును గుర్తుచేశారు. ఆ తర్వాత కొత్త తరహా విష సంస్కృతి కి ఇప్పుడే బీజం పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఒక మంత్రిని టార్గెట్ చేసినప్పుడు ఆయన శాఖలోని అవినీతిని వెలికి తీయడం.. మీడియాకు లీకులిచ్చి అవినీతిపై కథనాలు రాయించడం సహజం. కానీ ఇప్పుడు ఏకంగా వ్యక్తిత్వ హననం అనేది ఎజెండా పెట్టుకోవడమే తమలాంటి సీనియర్ నేతలను సైతం కలవరపాటుకు గురిచేసిందని ఆందోళన చెం దారు. వాస్తవానికి చాలా రోజుల కిందటే సదరు మంత్రిపై జుగుప్సాకర పోస్టులు మొదలయ్యాయి. ఒక టీవీ చానల్లోనూ అరకొర సమాచారం అన్నట్టుగా ప్రచారం చేశారు. వీటి వెనుక ‘ముఖ్య’నేత టీం ఉన్నదనే వార్తలు వచ్చాయి. ఈ ప్రచారం చాపకింద నీరులా విస్తరిస్తుంటే.. ‘ముఖ్య’నేత నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినపుడు దాన్ని తారస్థాయికి చేర్చాలనేది ఆ టీం ఎత్తుగడ! కానీ సంక్రాంతి సినిమాల రూపంలో ఆ సమయం వెంటనే వచ్చింది.
అన్నీ బేరీజు వేసుకొనే మీడియా ముందుకు కోమటిరెడ్డి
కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని మంత్రి కోమటిరెడ్డి సీరియస్‌గా తీసుకోలేదు. సినిమా టికెట్ల రేట్ల పెంపునకు సంబంధించి ‘ముఖ్య’నేతతో చోటుచేసుకున్న పరిణామాలు, ప్రభుత్వ పెద్ద కనుసన్నల్లో నడిచే ప్రముఖ టీవీ చానల్లో తనపై అదే దుష్ప్రచారం ప్రముఖం గా రావడంతో కోమటిరెడ్డికి అసలు విషయం బోధపడిందని సమాచారం. చానల్లో ప్రసా రం వెనుక వ్యవహారంపై ఆరా తీయగా.. ‘ముఖ్య’నేత బృందం నుంచి వచ్చిన సంకేతాల మేరకు ప్రత్యేకంగా ప్రతినిధిని కేటాయించి ఎపిసోడ్ పూర్తి చేసినట్టుగా తెలిసింది. ఇది మంత్రివర్గంలో కూడికలు.. తీసివేతల.. ‘ముఖ్య’ సమీకరణాలతో ముడిపడి ఉన్న అంశంగా గుర్తించినందునే వెంకట్‌రెడ్డి ఈ నెల 9న మీడియా ముందు ‘నాపై కసి తీరకపోతే ఇంత విషం ఇచ్చి చంపండి’ అని వ్యాఖ్యానించారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మీడియా సమావేశం తర్వాత తనను ఎం దుకు టార్గెట్ చేశారంటూ ‘ముఖ్య’నేతతో నేరుగానే మాట్లాడినట్టు ప్రచారం జరుగుతున్నది. దీంతో బయటికొస్తున్న తెరవెనుక పరిణామాల్లో అందరి వేళ్లూ తనవైపు చూపుతున్నాయని గ్రహించిన ‘ముఖ్య’నేత టార్గెట్ మినిస్టర్ ఆపరేషన్ వేగాన్ని తగ్గించాలని సూచించినట్టు తెలిసింది. అయితే ఇక్కడే ‘ముఖ్య’నేత ప్రణాళికకు భిన్నంగా ఐఏఎస్‌ల సంఘం తెరమీదికొచ్చినట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రధానంగా మహిళా ఐఏఎస్‌లపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని సీరియస్‌గా తీసుకొని ఫిర్యాదులు, కేసుల దాకా వెళ్లింది. దీంతో ఆపరేషన్ బూమరాంగ్ కావడంతో పాటు పరిస్థితులు ‘ముఖ్య’నేత చేతుల్లోంచి జారిపోయినట్టుగా స్పష్టమవుతున్నది. ‘గతంలో కూడా ఒక యూట్యూబర్ ఒక సీనియర్ ఐఏఎస్‌ను అసభ్య పదజాలంతో దూషించాడు. దీన్ని ఇలాగే వదిలేస్తే ఆలిండియా ఆఫీసర్లు అంటే లెక్కలేనితనం ఏర్పడుతుంది. అందుకే దీన్ని మనం సీరియస్‌గా తీసుకుంటున్నం’ అని సీనియర్ ఐఏఎస్ ఒ కరు వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం శ్రుతిమించి పాకాన పడుతున్నదని గుర్తించిన సదరు ముఖ్యనేత తక్షణమే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఈ వ్యవహారంపై విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తద్వారా ఈ లీకుతో తనకు సంబంధం లేదని మంత్రికి నచ్చజెప్పడంతో పాటు, ఐఏఎస్‌ల ఆగ్రహాన్ని చల్లబరచవచ్చన్నది ఆయన అభిప్రాయంగా చెప్తున్నారు.
హస్తిన స్థాయిలో విస్తృతంగా చర్చ..
తెలంగాణలోని పరిణామాలపై హస్తిన స్థా యిలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. అంతర్గత రాజకీయాల్లో మహిళా ఐఏఎస్‌లను లాగడంపై ఐఏఎస్ సర్కిల్ గుర్రుగా ఉన్నది. పలు రాష్ర్టాల ఐఏఎస్‌ల మధ్య కూడా చర్చ జరుగుతున్నది. ఢిల్లీలోని పలువురు సీనియర్ ఐఏఎస్‌లు తెలంగాణకు ఫోన్‌చేసి పరిణామాలపై వాక బు చేస్తున్నట్టు తెలిసింది. ఇదే సమయంలో ఏఐసీసీ స్థాయికి వ్యవహారం వెళ్లి హస్తిన పెద్దలు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తున్నది. ఇప్పుడే ఆరా తీస్తే విషయం మరిం త పెద్దదవుతుందని, సరైన సమయంలో కీలక సూత్రధారులు, పాత్రధారులను నిలదీయాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఇవన్నీ ఒకెత్తయితే.. దేశంలో అతి చిన్న రాష్ట్రమైన తెలంగాణకు ఢిల్లీస్థాయిలో ఉన్న ప్రతిష్ఠను ఈ పరిణామాలు దిగజార్చాయనే చర్చ కూడా జరుగుతున్నది.
కేసీఆర్ పదేండ్ల పాలనలో ప్రభు త్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వంటి వాటిపై తెలంగాణ చర్చకు కేంద్రం గా నిలిచిందే తప్ప ఇలాంటి నీచ సంస్కృతికి ఈ రాష్ట్రం వేదికగా నిలిచిందనే అపవాదును ఏనాడూ మూటగట్టుకోలేదని పలువురు సీనియ ర్ రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అధికార పార్టీ కేంద్రంగా సాగుతున్న రొచ్చు రాజకీయాల్లోకి తమను లాగడంపై తెలంగాణ క్యాడర్‌కు చెందిన మహిళా బ్యూరోక్రాట్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. వీలైనంత త్వర గా రాష్ట్రం నుంచి బయటపడేందుకు సాయం చేయాలని వారు ఇక్కడి తమ పరిచయస్తులను సంప్రదిస్తున్నట్టు ఐఏఎస్ వర్గాలు చెప్తున్నాయి. కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లే అవకాశాల కోసం వారు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.
‘సంక్రాంతి’ రూపంలో ప్రముఖ చానల్లో ముందే విడుదల
టార్గెట్ మినిస్టర్ ఆపరేషన్ నెమ్మదిగా ముందుకుపోతున్న క్రమంలో సంక్రాంతి సినిమాల టికెట్ల ధర తెరపైకి వచ్చి ఆపరేషన్‌ను ఒక్కసారిగా కీలక మలుపు తిప్పిందని సదరు నేత చెప్పడమే కాదు.. బ్యూరోక్రాట్లలోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి. పుష్ప-2 ఎపిసోడ్ సమయంలో తాను సీఎంగా ఉన్నంత కాలం టికెట్ల రేట్ల పెంపు, ప్రీమియర్ షోలు ఉండవని సీఎం రేవంత్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. కొన్నిరోజులకే నాలుక మడతేసి ప్రకటనను అటకెక్కించారు. కొంతకాలం కిందట మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇక తాము టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వబోమని కరాఖండిగా చెప్పారు. అయితే ఇటీవల వి డుదలైన ‘రాజాసాబ్’, ‘మన శంకర వప్రసాద్గారు’ సినిమాల విడుదలకు ముందు వాటి టికెట్ రేట్ల పెంపుపై ఈ నెల 7న ప్ర ముఖ సినిమా పెద్ద ‘ముఖ్య’నేతను సంప్రదించినట్టు తెలిసింది. కచ్చితంగా పెంపునకు అనుమతిస్తామని హామీ ఇచ్చిన ము ఖ్యనేత సంబంధిత అధికారులకు ఆదేశా లు ఇచ్చినట్టు సమాచారం.
విషయం కాస్తా సంబంధిత మంత్రి చెవిన పడింది. గత పరిణామాలను ప్రస్తావిస్తూ, అందునా తనకు తెల్వకుండా టికెట్ రేట్ల పెంపునకు ఎలా అనుమతిస్తారు? అంటూ నిలదీసినంత పని చేయడం తో ‘ముఖ్య’నేత హర్ట్ అయినట్టు సమాచారం. ఆ తర్వాత పరిణామా ల్లో భాగంగానే అప్పటికే సామాజిక మాధ్యమాల్లో చెలామణి అవుతున్న రోత అంశం ఓ ప్రముఖ చానల్లో సాయంత్రం ప్రసారమైంది. తదుపరి రోజు అంటే ఈ నెల 8న ‘రాజాసాబ్’ టికెట్ల పెంపు జీవో జారీ అయిందేగాని అదే తేదీపై ఉన్న ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమాకు సంబం ధించిన జీవో మాత్రం రాలేదు. ఆ తర్వాత ‘రాజాసాబ్’కు సంబంధించిన జీవోపై హై కోర్టులో పిటిషన్ పడటం, కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తెల్లారి సిని మా విడుదల అవుతుందనగా.. కోర్టుకు సెలవులున్న సమయాన్ని చూసుకొని ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమా టికెట్ల పెంపు జీవో ను బయటికి వదిలారు.
ఎప్పుడేం జరిగింది?
జనవరి 6: ప్రముఖ నటుడి నుంచి ఫోన్. తన సినిమాకు టికెట్ రేట్లను పెంచాలని వినతి. సరేనన్న ముఖ్యనేత
జనవరి 7: టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి అధికారులకు ఆదేశాలు. విషయం తెలుసుకున్న మంత్రి ఆగ్రహం. అదేరోజు సాయంత్రం 6.30 గంటలకు సదరు మంత్రిపై ప్రభుత్వ అనుకూల చానల్లో అసభ్య కథనం
జనవరి 8: టికెట్ రేట్లను పెంచుతూ జీవో జారీ
జనవరి 9: రేట్ల పెంపు జీవో విషయం తనకు తెలియదంటూ మంత్రి ఆవేదన. దీని వెనుక పెద్ద మతలబు ఉందని గ్రహించి, తర్వాతరోజు మాటమార్పు.
జనవరి 10: అసభ్య కథనాలపై ఐఏఎస్‌ల ఆగ్రహం. పోలీసులకు ఫిర్యాదు
జనవరి 13: వ్యవహారం ముదురుతుందని గుర్తించి మంత్రిని, బ్యూరోక్రాట్లను చల్లబరిచేందుకు కంటితుడుపుగా సిట్ ఏర్పాటు!
రైతుబంధు.. ఢిల్లీలోనే కాదు దేశవ్యాప్తంగా ఓ విప్లవాత్మక సంక్షేమానికి బాటలు వేసిన పథకం. కాళేశ్వరం ప్రాజెక్టు.. దేశ సాగునీటి చరిత్రలోనే ఒక పాఠంగా నిలిచిన విజయగాధ..
– ఇవీ.. తెలంగాణ రాష్ట్రం అనగానే నిన్నటిదాకా దేశ రాజధాని హస్తినతో పాటు ఇతర రాష్ర్టాల్లోనూ జరిగిన, జరుగుతున్న చర్చనీయాంశాలు.
మరి ఇప్పుడు?! రాజకీయాలకు బలవుతున్న బ్యూరోక్రాట్లు.. రాజకీయంగా ఒకరికి చెక్ పెట్టేందుకు బలి పశువులుగా మారిన ఐఏఎస్‌లు.. క్షుద్ర రాజకీయాల మధ్య మహిళా ఐఏఎస్‌ల మనోవేదన!
– ఇదీ ఇప్పుడు హస్తిన ఐఏఎస్ సర్కిళ్లు, రాష్ర్టాల్లోని బ్యూరోక్రాట్ల మధ్య జరుగుతున్న చర్చ! పోరాడి సాధించుకున్న తెలంగాణకు ఇదోమచ్చ!