నాంపల్లి క్రిమినల్ కోర్టు, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ పోలీసులు దాఖలు చేసిన మెమోను నాంపల్లి ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. బీజేపీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామిని 4, 5, 6వ నిందితులుగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బంధువు, న్యాయవాది శ్రీనివాస్‌ని ఏడో నిందితునిగా చేర్చాలంటూ నాంపల్లి ఏసీబీ కోర్టులో సిట్ మెమో దాఖలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా రామచంద్ర భారతి, నందుకుమార్, సింహయాజితో వీరికి సంబంధాలు ఉన్నట్టు సాక్ష్యాధారాలు ఉన్న నేపథ్యంలో వారిని కూడా ఏ4, ఏ5, ఏ6, ఏ7 నిందితులుగా చేర్చాలని కోరింది. అయితే, ఈ మెమోను నాంపల్లి ఏసీబీ కోర్ట్ జడ్జి రాజగోపాల్ డిస్మిస్ చేయడంతో హైకోర్టుకు వెళ్లే యోచనలో సిట్ ఉన్నట్టు సమాచారం.మరోవైపు మూడో నిందితుడు సింహయాజికి హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ కాపీతోపాటు ఇద్దరు న్యాయవాదులు రూ.6 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్‌ను జమానత్‌గా ఏసీబీ కోర్టులో అందజేశారు.