హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): అకుంఠిత దీక్ష, మొక్కవోని ధైర్యంతో ఒక్కడిగా బయల్దేరి తెలంగాణను సాధించిన కేసీఆర్ కారజన్ముడని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు. కేసీఆర్ చరిత్రను, ఆయన జీవిత విశేషాలను భావితరాలకు తెలియజేయాలనే సదుద్దేశంతో ‘ప్రజాయోధుడు’ పుస్తకాన్ని రాసిన మహేంద్ర తోటకూరి అభినందనీయుడని ప్రశంసించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన పుస్తకావిష్కరణకు సిరికొండ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ బాగుపడాలంటే రాష్ట్ర సాధనే ఏకైక మార్గమని భావించి కేసీఆర్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.
ఆంధ్రోళ్ల ఎత్తుగడలను గ్రహించి తెలంగాణ విలీనాన్ని వ్యతిరేకించిన జయశంకర్ సార్‌తో కలిసి పోరాటాన్ని ఉధృతం చేశారని గుర్తుచేశారు. నాలుగు కోట్ల జనులను ఏకం చేసి, 14 ఏండ్లు వీరోచితంగా పోరాడి శాంతియుత మార్గంలో రాష్ర్టాన్ని సాధించిన మహానుభావుడని, సాధించిన రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయి పాలనాదక్షతతో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపాడని కొనియాడారు. ‘కేసీఆర్ అంటే ఒక చరిత్ర.. ఆ చరిత్ర తరతరాలకు జీవనదిలా అందించాల్సిన అవసరం ఉన్నది’ అని నొక్కిచెప్పారు. తాను సైతం కేసీఆర్‌పై పుస్తకం రాస్తానని ప్రకటించారు.
స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో 14 ఏండ్లు తెలంగాణ ఉద్యమాన్ని నడిపి రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ జీవితచరిత్ర గురించి ‘ప్రజాయోధుడు’ పేరిట పుస్తకాన్ని రాయడం ఆనందంగా ఉన్నదని రచయిత మహేంద్ర తోటకూరి పేర్కొన్నారు. కేటీఆర్ ప్రోత్సాహంతోనే పుస్తకం రాయాలని సంకల్పించానని చెప్పారు. మూడు నెలలు కష్టపడి బాల్యం నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలు, ఉద్యమాన్ని నడిపినతీరు, తెలంగాణ సిద్ధించిన తర్వాత తన పదేండ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పుస్తకాన్ని రాశానని పేర్కొన్నారు.
కేసీఆర్ చరిత్రను చెరిపివేయాలని చూస్తున్న కాంగ్రెస్ సర్కారుకు ఈ పుస్తకం ద్వారా దీటుగా సమాధానమిచ్చానని చెప్పారు. తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమంలో కేసీఆర్ ఒక గొంతుకగా మారి దిశ, దశ చూపిన తీరును కండ్లకు కట్టినట్టు వివరించారు. తెలంగాణ ప్రతి పల్లెలోని చెరువులో, నల్లానీళ్లల్లో, పచ్చగా పెరిగిన మొక్కల్లో కేసీఆర్ ఆనవాళ్లు ఉన్నాయని, ఎవరూ ఆయన జ్ఞాపకాలను చెరిపివేయలేరని స్పష్టంచేశారు.