హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిం చే చట్టం తెచ్చాకే రాష్ట్రంలో స్థా నిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఇతర బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమా ండ్ చేశారు. ఒకవేళ ఆ చట్ట తేకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీ బీసీలకు తీరని ద్రోహం చేసినట్టేనని తేల్చిచెప్పారు. ఈ మేరకు మధుసూదనాచారి నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(సీఎస్)కి శనివారం వినతిపత్రం అందజేశారు.
ప్రభుత్వం నిర్వహించిన కులగణన లోపభూయిష్టంగా ఉన్నదని, దాన్ని సవరించాలని సీఎస్‌ను కోరారు. ఈ ప్రతినిధి బృందంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, నోముల భగత్, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్, ఆంజనేయులుగౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిశోర్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మధుసూదనాచారి మాట్లాడుతూ ప్రభుత్వం కులగణన పేరుతో బీసీలకు ద్రోహం చేసిందని విమర్శించారు. కులగణన పేరుతో బీసీలకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం సరిదిద్దుకోవాలని హితవు పలికారు. పాలన అంటే భక్షించడం, శిక్షించడం అని సీఎం రేవంత్‌రెడ్డి కొత్త భాష్యం చెప్పినట్టు వారి కార్యాచరణ కండ్లకు కడుతున్నదని పేర్కొన్నారు. తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌పై చిత్తశుద్ధి ఉంటే కులగణన పేరుతో జరిగిన పొరపాటును సవరించుకోవాలని, లేదంటే బీసీలకు అండగా బీఆర్ఎస్ రాజీలేని పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
గ్రామాలవారీగా చేపట్టిన కులగణన వివరాలను బయటపెట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. తప్పుల తడకగా ఉన్న కులగణనను సర్వేను వాస్తవిక సర్వేగా నమ్మించే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. బీసీలకు కాంగ్రెస్ సర్కార్ ద్రోహం చేస్తే ఉదృతమైన పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేసేంతవరకూ ప్రభుత్వం వెంటపడతామని తేల్చిచెప్పారు. ప్రభుత్వం బేషజాలకు పోకుండా చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని సూచించారు.
బీసీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని పార్లమెంట్లో లేవనెత్తి చర్చకు పెడతామని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ సహా కాంగ్రెస్‌లో ఉన్న బీసీ వర్గాలు ప్రభుత్వం అనుసరిస్తున్న బీసీ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని హితవు పలికారు. 10 ఏండ్లకు పెరగాల్సిన బీసీ జనాభా ఎలా తగ్గిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన బోగస్ సర్వేను ప్రజలెవరూ విశ్వసించడం లేదని చెప్పారు. తప్పుడు లెక్కలు చూపి బీసీలను అన్యాయానికి గురిచేస్తే కాంగ్రెస్ పార్టీ అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
బీసీలను అణచివేస్తే చరిత్రహీనులే అవుతారని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు ఇచ్చి హామీలను నిలబెట్టుకోకపోతే కాంగ్రెస్ నేతలను బీసీలు తరిమికొడ్తరని, గ్రామాల్లో తిరగనీయరని స్పష్టంచేశారు. బీసీలకు కాంగ్రెస్ కేటాయించిన మంత్రి పదవులే ఆ పార్టీకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. బీసీలపై సర్కార్ భారీ కుట్ర చేస్తున్నదని ధ్వజమెత్తారు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు. 42%రిజర్వేషన్లు కల్పించాకే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.