హనుమకొండ, డిసెంబర్ 14 : బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్ సర్కారు తప్పుడు ప్రచారం చేస్తున్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ధ్వజమెత్తారు. శనివారం సాయంత్రం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్తో కలిసి మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విడుదల చేసిన శ్వేతపత్రంలో గత బీఆర్ఎస్ సర్కారు రూ.6.70 లక్షల కోట్ల అప్పు చేసిందని తప్పుడు లెక్కలు చూపిందని దుయ్యబట్టారు.
ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలు 6 గ్యారెంటీలను అమలు చేయలేక కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హామీలు అమలు చేయలేకనే అప్పులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఆర్బీఐ హ్యాండ్ బుక్ ఆఫ్ ఇండియా ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలోని రూ.72,658 కోట్ల అప్పును పదేండ్ల క్రితం ఏర్పాటైన బీఆర్ఎస్ ప్రభుత్వం స్వీకరించిందని అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే రూ.5,118 కోట్లు అప్పు చేసిందని, ప్రస్తుతం అది రూ.80 వేల కోట్లు దాటిందని విమర్శించారు.
స్థూలంగా తెలంగాణ అప్పు మొత్తం రూ.4,28,540 కోట్లుంటే, అందులో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ. 3,28,499 కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు. ఇన్నాళ్లు రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ చేసిన ప్రచారం తప్పని ఆర్బీఐ హ్యాండ్ బుక్ ద్వారా నిరూపితమైందని తెలిపారు. ఇకనైనా కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ను విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో కూల్చివేతలు, ప్రేలాపనలు, ప్రగల్భాలు తప్ప చేసిందేమీ లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటికీ రూ.లక్ష లోపు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదని, రైతుబంధు ఇస్తలేరని దుయ్యబట్టారు.
హీర్యా నాయక్ అనే రైతు చేతులకు బేడీలు వేశారని, ప్రశ్నిస్తే జైల్లో వేస్తామనే ధోరణిలో సీఎం ఉన్నారని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి హోదాకు తగ్గట్టుగా వ్యవహరించడం లేదని, ఆయన ఇంకా ప్రతిపక్ష నేత అనుకొనే మాట్లాడుతున్నాడని విమర్శించారు. రేవంత్ తన భాష, వ్యవహారాన్ని మార్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు మోసపోయామని గమనించారని, ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ప్రజలకు మంచి చేయాలని, లేదంటే వారే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.