హైదరాబాద్, జనవరి 25(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణులు, విశ్వకర్మలు రాజకీయంగా ఉన్నతస్థాయికి ఎదుగాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. ఆదివారం రాష్ట్ర విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ మాతృ సంఘం అధ్యక్షుడు వేములవాడ మదన్మోహన్ అధ్యక్షతన హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్‌లో నిర్వహించిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యుల అభినందన సభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో విశ్వకర్మలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి చొరవ చూపాలని విజ్ఞప్తిచేశారు.
ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం అందజేసే అమరశిల్పి జకనాచార్య, విశ్వశిల్పి రామప్ప పురసారాలను సీనియర్ విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ శిల్పులకు అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ చొల్లేటి కృష్ణమాచార్యులు, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్, ధర్మపీఠం సభాపతి ఆచార్య త్రిమూర్తుల గౌరీశంకర్, రాష్ట్ర సంఘం కోశాధికారి రాగిఫణి రవీంద్రాచారి, రాష్ట్ర పౌరసంబంధాలశాఖ జేడీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.