పాన్‌గల్, ఏప్రిల్ 5: గోపల్‌దిన్నె- సింగోటం లింక్ కెనాల్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొల్లాపూర్, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం కిష్టాపూర్‌లో మీడియాతో వారు మాట్లాడారు. జలవిద్యుత్తు పేరిట శ్రీశైలంలో సాగునీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దోచుకుంటుంటే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలో పాన్‌గల్ మండలం కిష్టాపూర్ వద్ద రామన్నగట్టు రిజర్వాయర్ నిర్మాణం కోసం రూ.500 కోట్లు మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ నిధులను నిలిపివేసిందని ఆరోపించారు. రామన్నగట్టు రిజర్వాయర్‌తోనే సాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.