రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వానికి ముల్లుగుచ్చుకుంటే బీజేపీ నాయకులకు నొప్పి లేస్తున్నది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రాజెక్టుల నిర్మాణంలో నష్టాలు, అవినీతి వ్యవహారాలపై నోరు మెదపకుండా వంతపాడుతున్న బీజేపీ నేతలు.. బీఆర్ఎస్పై మాత్రం ఒంటికాలిపై లేస్తున్నరు. ఏపీ జల దోపిడీ విషయంలోనూ నోరెత్తకుండా కూడబలుక్కొని తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నరు.
-నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్ జూన్ 14 (నమస్తేతెలంగాణ): కాళేశ్వరం విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అగమేఘాలపై ఎన్డీఎస్ఏను పంపిన కేంద్రం.. ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలి ఎనిమిది మంది ప్రాణాలు పోయినా, సుంకిశాల కూలిపోయినా, వట్టెం పంప్‌హౌస్ మునిగిపోయినా ఎందుకు మౌనం వహిస్తున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందంలో భాగం కాదా? అంటూ ధ్వజమెత్తారు. రేవంత్ ప్రభుత్వానికి ముల్లుగుచ్చితే బీజేపీ నాయకులకు నొప్పి పెడుతున్నదని ఎద్దేవాచేశారు. శనివారం తెలంగాణ భవన్లో కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్గౌడ్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
రక్షణ చర్యలు చేపట్టకుండా, అధికారుల సూచనలు తీసుకోకుండా ఈ మార్గంలో 10 వేల లీటర్ల నీళ్లు ఉబికి వస్తున్నాయని కంపెనీ ఇచ్చిన నివేదికను కూడా పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకం పనులు మొదలు పెట్టిందని విమర్శించారు. కాళేశ్వరంపై కమిషన్ వేసిన ముఖ్యమంత్రి.. ఆధారాలుంటే కమిషన్‌కు ఇవ్వకుండా మీడియా ద్వారా ప్రజలకు చెప్తాననడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బాధ్యాతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి.. సర్కారు నియమించిన కమిషన్ పరిధిలోని అంశంపై బహిరంగంగా మాట్లాడతానని చెప్పడం అవగాహనారాహిత్యానికి నిదర్శనమని దెప్పిపొడిచారు.
ఇటీవల ఏపీ పర్యటనకు వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ కంటే ఏపీకి 10 రెట్లు ఎక్కువ నిధులిచ్చామని చెప్పడం దురదృష్టకరమని, ఏపీకి మేలు చేసి తెలంగాణకు అన్యాయం చేశామని ఆయన నిస్సిగ్గుగా ఒప్పుకొన్నారని నిరంజన్‌రెడ్డి దుయ్యబట్టారు. మన రాష్ర్టానికి పది రూపాయలు కూడా తీసుకురావడం చేతగాని సంజయ్.. ఆత్మాభిమానాన్ని చంపుకొని ఆంధ్రప్రదేశ్‌కు వంతపాడటం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవాచేశారు. సంజయ్ వెంటనే తెలంగాణ ప్రజలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
రుణమాఫీ సైట్‌ను మూసేసిన ప్రభుత్వం ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ఓట్లకోసమే మాఫీ కానీ రైతులు దరఖాస్తు చేసుకోవాలని నాటకాలాడుతున్నదని సింగిరెడ్డి మండిపడ్డారు. యాసంగిలో 72 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్టు చెప్తున్న సర్కారు, ఎంత మంది రైతులకు? ఎన్ని క్వింటాళ్ల వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చిందని ప్రశ్నించారు. భూమిని నమ్ముకున్న రైతు కుటుంబాలకు అండగా నిలిచేందుకు కేసీఆర్ తెచ్చిన రైతుబీమాను రేవంత్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. నిరుటి ప్రీమియాన్నే ఇప్పటికీ జమచేయలేదని విమర్శించారు.
గత యాసంగిలో నాలుగెకరాల్లోపు రైతులకే రైతుబంధు వేసిన ప్రభుత్వం మిగిలిన రైతులను దగా చేసిందని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. మళ్లీ లోకల్ బాడీ ఎన్నికల ముందు రైతుభరోసా వేస్తామని కొత్త డ్రామాకు తెరలేపిందని దుయ్యబట్టారు. ఓట్లు డబ్బాలో పడగానే రైతుభరోసా పథకాన్ని ఎత్తేసేందుకు కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. ఇది నిజం కాకుంటే ఈ పథకాన్ని నిరంతరం కొనసాగిస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో ఎరువులు, విత్తనాల కొరత రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు. ముందుచూపుతో ఎరువులను దిగుమతి చేసుకొని 6 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్‌ను నిల్వ ఉంచామని చెప్పారు.
కాంగ్రెస్ వచ్చిన తర్వాత 3 లక్షల టన్నుల ఎరువులను కూడా నిల్వచేయడం లేదని తెలిపారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించలేమని తెలిసే సరఫరా చేయడం లేదని కేంద్రంపై నెపం నెడుతున్నదని విమర్శించారు. నాడు రైతు సమస్యలపై సీఎం హోదాలో కేసీఆర్ అనేకసార్లు కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారని, కానీ సీఎం రేవంత్ మాత్రం ఏనాడూ రైతుల గురించి కేంద్ర మంత్రిని కలిసిన దాఖలాల్లేవని విమర్శించారు. అన్నదాతల మేలు మరిచి అందాల పోటీల్లో మునిగితేలారని తూర్పారబట్టారు.
ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు సాధ్యం కాదని కేసీఆర్ పలుమార్లు చెప్పారని నిరంజన్‌రెడ్డి గుర్తుచేశారు. 2016, మార్చి 31న అసెంబ్లీ సాక్షిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని తెలిపారు. అప్పటికే సొరంగంలోకి టన్నెల్ బోరు మిషన్ పంపించడం.. వందల కోట్లు ఖర్చుపెట్టడంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో ప్రాజెక్టు పనులు మొదలు పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. 2014 నుంచి 2023 వరకు రూ.3,900 కోట్లు వెచ్చించి 11.482 కిలో మీటర్ల టన్నెల్ తవ్వకం పనులు పూర్తిచేశామని తెలిపారు.
కానీ మూడేండ్లలో పూర్తిచేస్తామని గొప్పలకు పోయిన రేవంత్ ప్రభుత్వం ప్రమాదం జరిగిన తర్వాత ప్రత్యామ్నాయ మార్గాల పేరిట నాటకాలు ఆడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పుడు మళ్లీ రెండేళ్లలోనే పూర్తిచేస్తామని ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని విమర్శించారు. అమెరికాలో టీబీఎం డిజైన్‌కే మూడేండ్లు పడుతుందని, మరి ఏవిధంగా కంప్లీట్ చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా తప్పుడు మాటలు కట్టిపెట్టి వాస్తవాలను చెప్పాలని డిమాండ్ చేశారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ ప్రాజెక్టునూ రెండు, మూడేండ్లలో పూర్తిచేయలేదని గుర్తుచేశారు.
‘నేను మోదీ స్కూల్లో చదువుకున్న.. చంద్రబాబు కాలేజీలో ఇంటర్ పూర్తిచేసిన.. ఇప్పుడు రాహుల్ దగ్గర పనిచేస్తున్న అని ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ చెప్పిన మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నరు’ అని నిరంజన్‌రెడ్డి వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ఆయన వ్యాఖ్యలతో తెలంగాణ ప్రజలకు కలిగే ప్రయోజనమేమిటని నిలదీశారు. స్కూళ్లు ప్రారంభమైనా గురుకులాల అద్దె , విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు చెల్లించడం లేదని, పెండ్లి చేసుకున్న ఆడబిడ్డలకు తులం బంగారం, మహిళలకు ప్రతినెలా రూ. 2500 ఇవ్వడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తగిన సమయంలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
కనీస రక్షణ చర్యలు చేపట్టకుండా, అధికారుల సూచనలు తీసుకోకుండా, ఈ మార్గంలో 10 వేల లీటర్ల నీళ్లు ఉబికి వస్తున్నయని కంపెనీ ఇచ్చిన నివేదికను పట్టించుకోకుండా కాంగ్రెస్ సర్కారు ఎస్ఎల్బీసీ సొరంగం పనులు మొదలు పెట్టింది. ఈ ప్రభుత్వం చేసిన పాపానికి ఎనిమిది మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయినయి. ఇంత జరిగినా రెండేండ్లలో ప్రాజెక్టు పూర్తిచేస్తమని మంత్రి ఉత్తమ్ చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నది. అమెరికాలో టీబీఎం డిజైన్‌కే మూడేండ్లు పడుతది. మరి రెండేండ్లల్ల ఎట్ల కంప్లీట్ చేస్తరు?
-నిరంజన్‌రెడ్డి