Singareni | హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : మెస్సీ పది నిమిషాల ఫుట్‌బాల్ ఆట కోసం రూ.10కోట్లు దుబారా చేసిన సింగరేణి యాజమాన్యం స్వయానా దాని ఆవిర్భావ వేడుకలకు మాత్రం అత్తెసరు నిధులు విడుదల చేయడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటిపండుగగా, కుటుంబ ఉత్సవంగా నిర్వహించుకునే సందర్భానికి కేవలం ఎనిమిది నుంచి పది లక్షలిచ్చి చేతులు దులుపుకోవడంపై మండిపడుతున్నారు. మంగళవారం సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యాజమాన్యం చేపట్టిన కార్యక్రమాలపై పెదవి విరుస్తున్నారు.
గతంలో ఈ వేడుకల కోసం అన్ని ఏరియాలకు సంస్థ 50 లక్షలకు పైగా నిధులను కేటాయించిన దాఖలాలు ఉన్నాయని, ఇప్పుడు మాత్రం కేవలం 8 -10 లక్షలతోనే సరిపెట్టిందని, కొన్ని ఏరియాలకు గతంలో రూ.2.80 లక్షలు కేటాయిస్తే ప్రస్తుతం రూ.50వేలు ఇచ్చారని కార్మిక సంఘాల నేతలంటున్నారు. కేవలం ఉదయం కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రం ప్రదర్శించాల్సిన సాంస్కృతిక ఉత్సవాలను పూర్తిగా రద్దు చేసిన సంస్థ తీరును తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తీవ్రంగా ఖడించారు. ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం సింగరేణి సొమ్మును కోట్లు దుబారా చేసిన యాజమాన్యం, కార్మికులకు ఇచ్చే గౌరవడం ఇదేనా అని ప్రశ్నించారు.
గుట్టల్లా పోరుకు పోయిన బకాయిలు
సింగరేణి సంస్థ కొంతకాలంగా నిధుల కటకటను ఎదుర్కొంటున్నది. ఉద్యోగులకు నెలనెలా జీతాలివ్వలేని స్థితిలో సంస్థ ఉన్నది. ప్రతినెలా బ్యాంక్‌ల నుంచి ఓవర్‌డ్రాఫ్ట్ (ఓడీ)పై తాత్కాలిక అప్పుతోనే సంస్థ కార్యకలాపాలు నడుస్తున్నాయి. సంస్థకు ఇప్పటికే జెన్కో చెల్లించాల్సిన బకాయిలు గుట్టల్లా పేరుకుపోయి జూలై నాటికే రూ.23,311 కోట్లు ఉండగా, అవి డిసెంబర్ నాటికి దాదాపు రూ.29 వేల కోట్లకు చేరినట్టు సమాచారం. బకాయిల్లో కొంతైనా విడుదల చేయాలని సంస్థ మొరపెట్టుకుంటున్నా పట్టించుకునే వారే లేరు., పైగా ఈ విషయం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వద్దకు చేరినా స్పందన లేకపోవడంపై సంస్థ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఫలితంగా సింగరేణి సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్టు తెలుస్తున్నది.