Singareni | సింగరేణి భవన్, ఏప్రిల్ 23 , 2025 : సింగరేణి సంస్థలోని కేటగిరి-1లో పనిచేస్తున్న జనరల్ మజ్దూర్లను ఇకపై జనరల్ అసిస్టెంట్‌గా గుర్తించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన జాతీయ స్థాయి వేజ్ బోర్డు ఒప్పందం మేరకే ఈ పేరు మార్చాలని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.బలరాం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ సర్కులర్ జారీ చేశారు. ఈ ఉత్తర్వులపై సింగరేణిలోని 14 వేల మంది జనరల్ మజ్దూర్లతో పాటు కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఇప్పటివరకు సింగరేణి సంస్థలోని కేటగిరీ-1లో పనిచేసే వారిని జనరల్ మజ్దూర్ అని పిలవడం అలవాటుగా వస్తుంది. మజ్దూర్ అంటే హిందీలో కార్మికుడు, కూలీ అని అర్థం. సింగరేణి సంస్థలోనే కాకుండా కోల్ ఇండియాలో కూడా కింది స్థాయి ఉద్యోగులను ఇదే పేరుతో పిలుస్తూ వస్తున్నారు. బొగ్గు తవ్వకం తొలి రోజుల్లో గుత్తేదారులే యజమానులుగా ఉంటుండేవారు. బొగ్గు తవ్వడం కోసం పల్లె ప్రాంతం నుంచి కూలీ(మజ్దూర్)లను తీసుకొని వస్తుండేవారు. కాలక్రమంలో బొగ్గు గనులు జాతీయీకరణ జరిగిన తర్వాత ఈ మజ్దూర్లను అన్ని రకాల శారీరక శ్రమకు సంబంధించిన పనులకు వినియోగిస్తుండేవారు. అందుకే వీరిని జనరల్ మజ్దూర్లుగా గుర్తించారు.
గతంలో కేవలం నిరక్షరాస్యులు మాత్రమే జనరల్ జనరల్ మజ్దూర్లుగా పనిచేస్తుండేవారు. కానీ నేడు కారుణ్య నియామకాల్లో భాగంగా ఉన్నత చదువులు చదివిన వారు కూడా తొలుత బదిలీ వర్కర్లుగా ఎంపికై ఏడాది తర్వాత జనరల్ మజ్దూర్లుగా గుర్తించబడుతున్నారు. బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో జనరల్ మజ్దూర్లు కూడా కీలకంగా ఉంటున్నందువల్ల, వీరి వృత్తికి కూడా సముచిత గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతో జనరల్ మజ్దూర్ అనే పేరును తొలగించి జనరల్ అసిస్టెంట్‌గా మార్పు చేశారు. ఈ మార్పును వెంటనే అమలు చేసిన సీఎండీ బలరామ్‌కు కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు.