కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 23 : బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతతో సరిపెట్టుకోకుండా వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతూ ఆర్థికంగా నిలదొక్కుకునేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు సింగరేణి సీఎండీ బలరాం అన్నారు. సింగరేణి డే సందర్భంగా సోమవారం ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని కేంద్ర కార్యాలయం నుంచి ప్రకాశం స్టేడియం వరకు 2కే రన్ నిర్వహించారు. అనంతరం సింగరేణి పతాకాన్ని ఆవిష్కరించి స్టాళ్లను ప్రారంభించారు. రాత్రి ప్రకాశం స్టేడియంలో జరిగిన వేడుకల్లో సీఎండీ బలరాం మాట్లాడారు. నష్టాల్లో కూరుకుపోయిన సింగరేణి సంస్థను కార్మికులు, అధికారులు సమష్టి కృషితో 22 ఏండ్లుగా లాభాల బాటలో నడిపిస్తున్నారని తెలిపారు. మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని నెలకొల్పడంతోపాటు మరో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. త్వరలోనే లోయర్ మానేరు రిజర్వాయర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్లపై ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు, సింగరేణిలోనే కాకుండా ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో కూడా సింగరేణి ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.