హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): లిథియం సహా పలు క్రిటికల్ మైనింగ్ రంగంలోకి ప్రవేశించేందుకు సింగరేణి కసరత్తు చేస్తున్నది. ఇందుకు ఐఐటీ హైదరాబాద్ సహకారాన్ని కోరుతున్నది. ఈ మేరకు సింగరేణి సీఎండీ ఎన్ బలరాం, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తితో శనివారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. క్రిటికల్ మైనింగ్, ప్రాసెసింగ్‌లో పరస్పర సహకారంపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా సీఎండీ బలరాం మాట్లాడుతూ .. బొగ్గు మైనింగ్‌లో సుధీర్ఘ అనుభవం కలిగిన సంస్థ ఇక నుంచి క్రిటికల్ మైనింగ్ రంగంలోను అడుగుపెట్టనుందన్నారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న ఫ్లైయాష్‌లో అరుదైన ఖనిజాలున్నట్లు పరిశోధనల్లో తేలిందన్నారు.
రాజ్యాంగ సూత్రాలతో తెలంగాణ ఏర్పాటు
హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగంలో పొందుపర్చిన సూత్రాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు, యువకుల ప్రాణ త్యాగాలతో తెలంగాణ అవతరించిందని పేర్కొన్నారు. నేడు గణతంత్ర దినోత్సవం మాత్రమే కాదని.. రాజ్యాంగ సూత్రాలతో తెలంగాణ ఏర్పడిన ప్రత్యేకమైన రోజు అని గవర్నర్ ఉద్ఘాటించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనమంతా భారత రాజ్యాంగంలోని ఆలోచనలు, హక్కులు, బాధ్యతలు, విలువలకు పునరంకితం కావాలని గవర్నర్ పిలుపునిచ్చారు.