హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): సింగరేణిలో ఉత్పత్తవుతున్న అధిక శాతం బొగ్గును పర్యావరణహితంగా రైలుమార్గం ద్వారా రవాణాచేయడం, ఇందుకోసం సొంతగా రైలు మార్గాలను నిర్మించడంపై కోల్లాగ్ ఇండియా-2022 అంతర్జాతీయ సదస్సు ప్రశంసలు కురిపించింది. కోల్కతాలో నిర్వహించిన ఈ సదస్సును కోలిండియా చైర్మన్ ప్రమోద్ అగర్వాల్ ప్రారంభించారు. పర్యావరణహిత బొగ్గు రవాణా ఏర్పాట్లను సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్ చంద్రశేఖర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ఓపెన్ కాస్టుల నుంచి ఉత్పత్తి చేసే బొగ్గును తరలించేందుకు 54 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గాన్ని దక్షిణ మధ్య రైల్వేతో కలిసి రికార్డు సమయంలో నిర్మించి రవాణా ప్రారంభించామని తెలిపారు. మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యు త్తు కేంద్రానికి బొగ్గు రవాణా కోసం సింగరేణి స్వయంగా 22 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గాన్ని నిర్మించిందని వెల్లడించారు.
సింగరేణిలో అతిపెద్ద పర్యావరణహిత సీహెచ్సీని సత్తుపల్లి వద్ద ఇటీవలనే నిర్మించామని, అన్ని ఏరియాల్లోని సీహెచ్పీలను ఆధునికీకరిస్తున్నామని వివరించారు. సదస్సులో పాల్గొన్న దేశ, విదేశాలకు చెందిన ప్ర ముఖ కంపెనీల ప్రతినిధులు సింగరేణి చర్యలను అభినందించారు. బొగ్గు రవాణాలో ఇతర మార్గాలు అనే అంశంపై జరిగిన సమావేశంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్ చంద్రశేఖర్, షిప్పింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సవ్యసాచి హజారా, సమంతా ఎండీ ఎన్ సమం తా, వేదాంత తరఫున అడ్వయిజర్ మనోరంజన్నాయక్, సింగరేణి ప్రతినిధి తాడబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.