Artificial Intelligence | జీవితంలోని అన్ని అంశాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావితం చేస్తోందని సింగరేణి కాలరీస్ కంపెనీ సీఎండీ ఎన్. బలరాం అన్నారు. ఈ సాంకేతిక విపల్వం పట్ల వ్యతిరేక ధోరణి మాని దాన్ని సమర్థంగా, బాధ్యతతో వినియోగించుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు.
తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన జాతీయ ప్రజా సంబంధాల దినోత్సవాలకు బలరాం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. “ఏఐ కొత్త విషయం కాదు. ఇది ఎప్పటినుంచో ప్రభావం చూపుతూ ఉంది. మానవాళి మనుగడ దీనిమీద ఆధారపడి ఉందని అనడం అతిశయోక్తి కాదు” అని ఆయన చెప్పారు. తాను సారథ్యం వహిస్తున్న సింగరేణి సంస్థలో కూడా కాలానుగుణంగా టెక్నాలజీ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు అయన చెప్పారు. కార్మికులు, అధికారుల సమన్వయంతో సింగరేణిలో ప్రవేశపెట్టిన వినూత్న పథకాలను ఆయన విశదీకరించారు.
మహీంద్రా యూనివర్సిటీ డిజిటల్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ స్కూల్ ప్రొఫెసర్ శశిధర్ నంజుండయ్య కీలకోపన్యాసం చేస్తూ.. వృత్తినిపుణులు ఏఐని ప్రభావశీలంగా ఎలా వాడుకోవచ్చో విశదీకరించారు. సమాచార ప్రసారంలో టెక్నాలజీ పాత్ర అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో నైతికతకు పెద్ద పీట వేయాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పీఆర్ఎస్ఐ మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు కృష్ణ బాజీ తన 40 ఏళ్ల కెరీర్లో పీఆర్ ను శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎలా ప్రభావితం చేసిందో వివరించారు. ఈ సందర్భంగా పీఆర్ఎస్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అజిత్ పాఠక్ పంపిన సందేశాన్ని నేషనల్ కమిటీ సభ్యుడు మోహన్ రావు చదివి వినిపించారు. పీఆర్ఎస్ఐ హైదరాబాద్ ఛాప్టర్ ఛైర్మన్, ఎం ఎన్ ఆర్ యూనివర్సిటీ డైరెక్టర్ (కొలాబరేషన్స్) మరియు ప్రొఫెసర్ (కమ్యూనికేషన్స్) డాక్టర్ ఎస్ రాము మాట్లాడుతూ.. ఏ ఐ టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకోవడం ఎలాగో విద్యార్థులకు బోధించాలని సూచించారు.