హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థ పరిధిలోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్పీ)ల సామర్థ్యాన్ని 80 మిలియన్ టన్నుల నుంచి 100 మిలియన్ టన్నులకు పెంచాలని, ఏడాదిలో మరో మూడు సీహెచ్పీలను ప్రారంభించాలని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం అధికారులను ఆదేశించారు. శనివారం సింగరేణిభవన్ నుంచి సీహెచ్పీలు, యంత్రాల పనితీరుపై ఆయన సమీక్షించారు.
ఇప్పటి వరకు 11 సీహెచ్పీలుండగా, 5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో రామంగుండంలోని జీడీకే -6 సీహెచ్పీ, 6 మిలియన్ టన్నుల సామర్థ్యంతో కొత్తగూడెం వీకే, 2 మిలియన్ టన్నుల సామర్థ్యంతో మందమర్రిలో కొత్త సీహెచ్పీలను నిర్మిస్తున్నట్టు సీఎండీ తెలిపారు. సంస్థ యంత్రాలతోనే రెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ను తొలగించాలని చెప్పారు. యంత్రాలను రోజుకు 13-14 గంటలు కాకుండా 20 గంటల వరకు వినియోగించాలని సూచించారు.