Musi Project | మూసీ ప్రాజెక్టు సింగపూర్ కంపెనీ మెయిన్హార్ట్కే ఎలా దక్కింది? ఎందుకు దక్కింది? దీని మూలాలు తవ్వినకొద్దీ ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిజానికి తెలంగాణకు చెందిన కన్సల్టెన్సీకి రావాల్సిన టెండరు, చంద్రబాబు- రేవంత్ మీటింగ్ తర్వాత అకస్మాత్తుగా రైద్దెనట్టు, తర్వాత మెయిన్‌హార్ట్ కంపెనీకి దక్కినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ కథాక్రమం ఇదిగో..
మూసీ ప్రాజెక్టు మాస్టర్‌ప్లాన్ కోసం తొలి టెండరు నోటిఫికేషన్ జారీ అయింది. దీన్ని ఏడోతేదీ అప్లోడ్ చేసారు. బిడ్ల దాఖలుకు మార్చి 22ను గడువుగా పెట్టారు. గడువులోగా 10 కంపెనీలు ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్- ఈవోఐ) బిడ్లు దాఖలు చేశాయి. ఇందులో ఏడు కంపెనీలు సాంకేతిక అర్హత సాధించాయి. తర్వాత ఏప్రిల్ 10న రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్‌కు నోటిఫికేషన్ జారీ అయింది. 5 కంపెనీలే బిడ్లు దాఖలు చేశాయి.
ఆర్ఎఫ్పీ బిడ్ల దాఖలు గడువు ముగిసింది. 5 కంపెనీల్లో తెలంగాణకు చెందిన సాయి కన్సల్టెన్సీ రూ.60 కోట్లతో ఎల్-1గా నిలవగా, ట్రాక్ట్బెల్ అనే కంపెనీ 75 కోట్లు కోట్ చేసి ఎల్-2గా నిలిచినట్టు తెలిసింది.
ఏపీ సీఎం బాబు హైదరాబాద్‌కు వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇరు రాష్ర్టాల మధ్య సమస్యల పరిష్కారం కోసమే ఈ సమావేశమనే ప్రకటన వెలువడింది.
మూసీ ప్రాజెక్టు మీద టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ ఏర్పాటు చేస్తూ జీవో ఆర్టీ నం.325 జారీ అయింది. ఏర్పాటైన రెండు రోజులకే, జూలై 22న కమిటీ తొలి భేటీ జరిగింది. మూసీ టెండర్లను రద్దు చేయాలని అందులో నిర్ణయించారు. ఇది జరిగి రెండు రోజులు తిరక్క ముందే జూలై 24న మూసీ టెండర్ల రద్దు కోసం ఎమ్మార్డీసీఎల్ ఎండీ ప్రభుత్వానికి లేఖ రాశారు.
మూసీ టెండర్లను రద్దు చేసి, తిరిగి నోటిఫికేషన్ ఇచ్చేందుకు రేవంత్ సర్కారు అనుమతినిచ్చింది. తర్వాత మూడు రోజులకే అంటే 6వ తేదీన పాత టెండర్లు రద్దు చేసినట్టు తెలిసింది.
టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ మళ్లీ సమావేశమై కొత్త నోటిఫికేషన్‌కు నిర్ణయించింది. తర్వాత 5 రోజులకు అంటే ఆగస్టు 13న కొత్త నోటిఫికేషన్ జారీ అయింది.
బిడ్లకు గడువు ముగిసింది. ఈసారి కేవలం రెండు కంపెనీలే బిడ్లు దాఖలు చేశాయి. ఇందులో ఒకటి మెయిన్‌హార్ట్ కాగా, మరొకటి లీ అసోసియేట్స్ అని సమాచారం. లీ అసోసియేట్స్ 141 కోట్లకు బిడ్ వేసి ఎల్-1గా నిలవగా, మెయిన్‌హార్ట్ 143 కోట్లతో ఎల్-2గా ఉన్నట్టు తెలిసింది.
మూడోసారి టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ సమావేశం. ఎల్-1గా లీ అసోసియేట్స్‌ని సాంకేతిక కారణాలతో తిరస్కరించి, మెయిన్‌హార్ట్ కన్సార్షియంకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం. తర్వాత పది రోజులకు (4న) ప్రభుత్వం దీన్ని ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణ అంచనా వ్యయంలోనే కాదు, మాస్టర్‌ప్లాన్ తయారీ కన్సల్టెన్సీ ఎంపిక టెండర్లలోనూ భారీ గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మొదటిసారి టెండర్ నోటిఫికేషన్ జారీచేసిన ఎంఆర్డీసీఎల్ అధికారులు ప్రైస్ బిడ్లను తెరిచి ఆర్నెల్ల తర్వాత వాటిని రద్దు చేయడం ఒకవంతైతే, కేవలం వారం వ్యవధిలోనే రెండోసారి టెండర్లు పిలిచి రెండు నెలల్లోపే మెయిన్‌హార్ట్‌కు పనుల అప్పగింత ప్రక్రియను అధికారికంగా పూర్తి చేయడం మరో వంతు. అంతేకాదు, రెండోసారి టెండర్లలో మెయిన్‌హార్ట్ కంపెనీ కంటే లీ అసోసియేట్స్ తక్కువ మొత్తానికి కోట్ చేసినప్పటికీ అధికారులు సాంకేతిక కారణాన్ని చూపి లీ అసోసియేట్స్‌ను ఎలిమినేట్ చేసినట్టు విశ్వసనీయం సమాచారం.
ప్రధానంగా సీఎం రేవంత్‌రెడ్డితో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధికారికంగా భేటీ అయిన తర్వాతనే ఈ టెండర్ల ప్రక్రియలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెయిన్‌హార్ట్‌కు మూసీ సుందరీకరణ బాధ్యతలు అప్పగించేందుకే టెండర్ల ప్రక్రియను అద్యంతం తామనుకున్నట్టు నడిపించారని తెలిపింది.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. ఈ ప్రాజెక్టును నిర్వహించే మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) అధికారులు ఆదిలో నిబంధనల ప్రకారమే టెండర్ల ప్రక్రియను నిర్వహించినప్పటికీ అనంతరం ‘సాంకేతిక కారణాలు’ అనే ముసుగు తొడిగి, నిబంధనలకు తిలోదకాలివ్వడం వెనక ‘పెద్దల’ జోక్యం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ సుందరీకరణ ప్రాజెక్టును రూ.50 వేల కోట్లతో చేపడుతున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
ఈ క్రమంలో ఎంఆర్డీసీఎల్ అధికారులు ప్రాజెక్టు మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు కన్సల్టెన్సీ ఎంపికను చేపట్టారు. ఈ మేరకు ఎంఆర్డీసీఎల్ అధికారులు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్ల కోసం ఈ ఏడాది ఫిబ్రవరి ఐదో తేదీన టెండర్ నోటీస్ (నెం.05/ఎస్ఈ(ఎంఆర్డీసీఎల్)/2023-24, తేదీ: 5.2.2024) జారీ చేశారు. ఇందుకుగాను పది కంపెనీలు ముందుకొచ్చి బిడ్లు దాఖలు చేశాయి. నిబంధనల ప్రకారం అధికారులు ప్రీ బిడ్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. బిడ్లు దాఖలు చేసిన వాటిలో నిబంధనల మేరకు ఏడు కన్సల్టెన్సీ కంపెనీలు సాంకేతిక అర్హత సాధించాయి. అనంతరం అధికారులు ఏప్రిల్ 10వ తేదీన ఆర్ఎఫ్పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) నోటిఫికేషన్ జారీచేశారు.
ఇందులో బిడ్ల దాఖలును అదే రోజు ప్రారంభించి, చివరి తేదీని జూన్ 24గా నిర్ణయించారు. అయితే సాంకేతిక అర్హత సాధించిన ఏడు కంపెనీల్లో ఐదు కంపెనీలు మాత్రమే ఈ నోటిఫికేషన్‌కు స్పందించి, ఆర్ఎఫ్పీని సమర్పించాయి. అందులో లీ అసోసియేట్స్ సౌత్ ఏషియా ప్రైవేటు లిమిటెడ్, జురాంగ్ కన్సల్టెంట్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, ట్రాక్టబుల్ ఇంజినీరింగ్ ప్రైవేటు లిమిటెడ్, సాయి కన్సల్టెన్సీ ఇంజినీరింగ్ లిమిటెడ్, మెయిన్‌హార్ట్ సింగపూర్ ప్రైవేటు లిమిటెడ్ ఉన్నాయి.
ఈ నేపథ్యంలో అధికారులు ప్రైస్ బిడ్లను తెరవగా అందులో అతి తక్కువగా సాయి కన్సల్టెన్సీ కంపెనీ రూ.60 కోట్లకు కోట్ చేసి ఎల్-1గా నిలిచి, ఎల్-2గా ట్రాక్టబుల్ ఇంజినీరింగ్ ప్రైవేటు లిమిటెడ్ రూ.75 కోట్లను కోట్ చేసినట్టు తెలిసింది. దీంతో సాయి కన్సల్టెన్సీకి అధికారులు బాధ్యతను అప్పగించాలి. కానీ ఆతర్వాత సీన్ మారింది. సాంకేతిక కారణాలతో ఆర్ఎఫ్పీ టెండర్లను రద్దు చేస్తున్నట్టుగా ఎంఆర్డీసీఎల్ అధికారులు ఆగస్టు ఆరో తేదీన నిర్ణయం తీసుకున్నారు. అసలు ఆ సాంకేతిక కారణాలేమిటో? ఎందుకు రద్దు చేశారనేది అధికారులు వెల్లడించడం లేదు.
ఎంఆర్డీసీఎల్ అధికారులు మొదటిసారి ఆర్ఎఫ్పీ నోటిఫికేషన్‌ను రద్దుచేసిన వారం రోజుల్లోనే రెండో దఫా నోటిఫికేషన్ జారీచేశారు. ఆగస్టు 13న బిడ్ల దాఖలును మొదలుపెట్టిన అధికారులు చివరి తేదీని సెప్టెంబరు 12గా నిర్ణయించారు. అయితే ఈసారి మాత్రం కేవలం రెండు కన్సల్టెన్సీ కంపెనీలు మాత్రమే బిడ్లు దాఖలు చేసినట్టు తెలిసింది. ఇందులో లీ అసోసియేట్స్ ఒకటికాగా, రెండోది మెయిన్‌హార్ట్ సింగపూర్ ప్రైవేటు లిమిటెడ్. గతంలో ఏకంగా పది కంపెనీలు ఉత్సాహంగా ముందుకొచ్చిన పరిస్థితి నుంచి రెండోసారి కేవలం రెండు కంపెనీలు మాత్రమే బిడ్లు దాఖలు చేయడంపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రెండు కంపెనీలకు సంబంధించిన ప్రైస్ బిడ్లను తెరవగా అందులో లీ అసోసియేట్స్ రూ.141 కోట్లు కోట్ చేస్తే, మెయినహార్ట్ కన్సల్టెన్సీ రూ.143 కోట్లు కోట్ చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎంఆర్డీసీఎల్ అధికారులు లీ అసోసియేట్స్‌ను ఎల్-1గా నిర్ధారించి బాధ్యతలు అప్పగించాలి. కానీ, ఇక్కడే అసలు మతలబు చోటుచేసుకుందనే ఆరోపణలున్నాయి. తర్జనభర్జనల తర్వాత అధికారులు లీ అసోసియేట్స్ బిడ్‌ను సాంకేతిక కారణాలతో తిరస్కరించినట్టుగా సమాచారం. ఇక మిగిలింది మెయిన్‌హార్ట్ కావడంతో దాని బిడ్‌ను సుమారు రూ.141 కోట్లుగా నిర్ధారించి, ఎల్-1గా ఎంపిక చేసినట్టు తెలిసింది.
ఎంఆర్డీసీఎల్ అధికారులు ఆదిలో నిబంధనల ప్రకారమే టెండర్ల ప్రక్రియను ముందుకు తీసుకుపోగా, తదుపరి ఎందుకు ఇంత గందరగోళానికి తావిచ్చారనే దానిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమరావతి గ్రాఫిక్స్ సృష్టికర్త సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్‌తో సంబంధాలున్న మెయిన్‌హార్ట్‌కు మూసీ మాస్టర్‌ప్లాన్ బాధ్యతలు అప్పగించేందుకు తెర వెనక పెద్ద వ్యక్తులే పావులు కదిపారనే ప్రచారం జరుగుతున్నది. రేవంత్, చంద్రబాబు భేటీ తర్వాతే ఇందులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయనే ప్రచారమూ పెద్దఎత్తున జరుగుతున్నది.
వాస్తవానికి మూసీ సుందరీకరణ అంచనా వ్యయం రూ.58వేల కోట్లే. ఇదే విషయాన్ని ఎంఆర్డీసీఎల్ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీచేసిన టెండరు నోటీసు డాక్యుమెంట్లలో స్పష్టంగా పొందుపరిచారు. 31 పేజీల డాక్యుమెంట్లలో 13వ పేజీలో మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు వ్యయం ఏడు బిలియన్ అమెరికా డాలర్లు (సుమారు రూ.58,775.22 కోట్లు) ఉంటుందని అంచనా వేస్తున్నట్టుగా పేర్కొన్నారు. అందుకే సీఎం రేవంత్‌రెడ్డి కూడా పలుసార్లు రూ.50వేల కోట్లతో మూసీ సుందరీకరణ చేపడతామని ప్రకటించారు. కానీ, మెయిన్‌హార్ట్ రంగ ప్రవేశం తర్వాత అమాంతంగా అది లక్షన్నర కోట్లకు ఎగబాకింది. సీఎం నోటి నుంచి ప్రకటన రూపంలో రావడం మొదలైంది. అయితే, తొలిసారి లక్షన్నర కోట్ల వ్యయాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి… పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కేవలం మూసీ సుందరీకరణ కోసమే కాదు, ఐదేండ్లలో హైదరాబాద్ అభివృద్ధి కోసమని అన్నారు.