నాగర్ కర్నూల్: రాజకీయాలు, సిద్ధాంతాలు పక్కనపెట్టి 60 ఏండ్ల తెలంగాణ కలను సాకారం చేసిన బీఆర్ఎస్ ( BRS ) పార్టీ రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి (Marri Janardhan Reddy) కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా కేసీఆర్ ( KCR ) స్థాపించిన బీఆర్ఎస్ అన్ని సందర్భాల్లో తెలంగాణ ప్రజలకు గుండె ధైర్యాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.
24 ఏళ్లపాటు ఎన్నో పోరాటాలు చేసి స్వరాష్ట్రం సాధించి, ప్రజల అభీష్టం మేరకు ప్రభుత్వంలో ఉండి తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిందని తెలిపారు. కేసీఆర్ మాట వినాలని, ఆయన మాట వింటే గుండె నిండా ధైర్యం వస్తదని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ప్రజలు కేసీఆర్ మాటలు వింటే కాంగ్రెస్ అరాచక పాలన అంతమవుతదనే భరోసా కలుగుతుందని వెల్లడించారు.
ఎల్కతుర్తిలో జరగబోతున్న సభ ఆషామాషీ సభ కాదు. దేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయే మహాసభగా నిలుస్తుంది అని పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ వార్డుల్లో పార్టీ శ్రేణులు గులాబీ జెండాలు ఎగురవేసి బయలుదేరాలని సూచించారు. సభ స్థలికి సమయం కంటే ముందుగానే చేరుకోవాలని సూచించారు.