– నాలుగేళ్లుగా మహిళపై లైంగిక దాడి
– ఐజీకి బాధితురాలి ఫిర్యాదు
– నిందిత ఎస్ఐ గోదారి రాజ్‌కుమార్‌పై కేసు నమోదు
సుబేదారి(వరంగల్), జూన్ 13 : వరంగల్ పోలీసు కమిషనరేట్ సిసిఎస్ విభాగంలో పని చేస్తున్న ఎస్ఐ గోదారి రాజ్‌కుమార్ ఓ వివాహితపై ఖాకీ మాటున నాలుగేళ్లుగా నరకం చూపిస్తూ లైంగిక దాడికి పాల్పడుతుండగా, ఆ ఎస్ఐ అరాచకాన్ని భరించలేక బాధితురాలు పోలీసు ఉన్నత అధికారులకు పిర్యాదు చేసింది. ఈ మేరకు హనుమకొండ పోలీసు స్టేషన్లో నిందితుడు ఎస్ఐ రాజ్ కుమార్‌పై పలు సెక్లన కింద కేసు నమోదైంది. బాధితురాలు ఫిర్యాదు, హనుమకొండ పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండకు చెందిన యువతికి 2018లో బీ ఫార్మసీ చదువుతున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప, కొద్దిరోజుల తర్వాత ఇద్దరి మధ్య కుటుంబ కలహాలు రావడంతో 2022 మార్చిలో బాధిత వివాహిత భర్తపై హనుమకొండ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అపుడు ఆ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న గోదారి ఎస్ఐ రాజ్ కుమార్ న్యాయం చేస్తానని నమ్మించి, అతడికి తెలిసిన న్యాయవాదితో భర్తకు విడాకులు ఇప్పించాడు. తర్వాత పెళ్లి చేసుకుంటాను అని ఆ వివాహితను నమ్మించి, లొంగదీసుకుని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె రెండు సార్లు గర్భం దార్చలడంతో అబార్షన్ చేయించాడు.
బాధిత వివాహిత పెళ్లి విషయంపై ఎస్ఐ రాజ్ కుమార్‌ను గట్టిగా అడగడంతో న్యూడ్ ఫొటోస్ తో బ్లాక్ మెయిల్ చేస్తూ, బెదిరింపులకు పాల్పడడం, ఆమె పనిచేసే చోటకి ఫోన్ నంబర్ లొకేషన్ తెలుసుకుని అక్కడి నుండి, బలవంతంగా హోటల్స్ కి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె ఫోన్ నంబర్స్ ట్రాక్ చేసి అనుమానించి వేధింపులకు పాల్పడ్డాడు. ఈ నెల మొదటి వారంలో ఎస్ఐ రాజ్ కుమార్, బాధిత వివాహితను హనుమకొండలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి, కొట్టడంతో భాదితురాలు నన్ను వదిలిపెట్టమని, నాకో పాప ఉంది, నా బతుకు నేను బతుకుతా వదిలిపెట్టు అని కాళ్ల మీద పడి వేడుకున్నా, నిన్ను ఎవడు పెళ్లి చేసుకోకుండా చేస్తా, జీవితాంతం నాతోనే లైంగికంగా ఉండాలి, లేదంటే న్యూడ్ పిక్స్ బయట పెడతా అని బ్లాక్ మెయిల్ చేశాడు. బాధిత మహిళ ఎస్ఐ అరాచకాన్ని భరించలేక రెండు రోజుల క్రితం హైదరాబాదులోని ఐజీ కి ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఉన్నత అధికారి ఆదేశాల మేరకు భరోసా సెంటర్లో శనివారం మహిళా పోలీసు అధికారి బాధితురాలి స్టేట్మెంట్ తీసుకుని హనుమకొండ పీఎస్‌కు రిఫర్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు హనుమకొండ పీఎస్ లో ఎస్ఐ రాజ్ కుమార్ పై లైంగిక దాడి, బెదిరింపు, చీటింగ్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివ కుమార్ తెలిపారు. కాగా నిందితుడు ఎస్ఐ రాజ్ కుమార్ వరంగల్ పోలీసు కమిషనరేట్ సీసీఎస్ విభాగంలో పని చేస్తున్నాడు. ఇంతకు ముందు ఎల్కతుర్తి పీఎస్ లో పని చేసినప్పుడు అవినీతి కారణంగా సస్పెండ్ సైతం అయ్యాడు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ అధికారి, న్యాయం కోసం వచ్చిన బాధితురాలిను నమ్మించి నాలుగేళ్లుగా కామవంచతో నరకం చూపడం వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో కలకలం సృష్టించింది.