హైదరాబాద్ : ఈ నెల 7వ తేదీన(ఆదివారం) ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను టీఎస్ఎల్పీఆర్బీ(తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్) పూర్తి చేసింది. ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కు హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం 503 సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా మరో 35 పట్టణాల్లోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు నియామక మండలి ప్రకటించింది. మొత్తం 554 పోస్టులకు గానూ 2,47,217 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని స్థానిక ఎస్హెచ్ఓలకు పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. శుక్రవారం అర్థరాత్రితో 12 గంటలతో హాల్‌టికెట్ల డౌన్లోడ్ గడువు ముగుస్తోంది.
-ఎస్ఐ ప్రిలిమ్స్ హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు వాటిని ఏ4 సైజ్‌లో రెండు వైపులా(హాల్‌టికెట్ ఒకవైపు, వెనుక వైపు సూచనలు ) వచ్చేలా ప్రింట్ అవుట్‌ను తీసుకోవాలి. కలర్లో ప్రింట్ అవుట్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
-ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత దానిలో ఎడమవైపు కింది భాగంలో ఇచ్చిన బాక్స్‌లో పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను గమ్‌తో అతికించాలి. పిన్నులతో, గుండు పిన్నులతో ఫొటోలు పెట్టొద్దు.
-పాస్‌పోర్ట్ సైజు ఫొటో గతంలో దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసినదై ఉండాలి.
-ఫొటో అతికించని హాల్‌టికెట్‌తో వచ్చే అభ్యర్థులను పరీక్ష కేంద్రానికి అనుమతించబడదు. తప్పక ఫొటో అతికించి తీసకురావాలి.
-పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్నులు తీసుకెళ్లొచ్చు.
-పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకుంటారు. కాబట్టి, అభ్యర్థులు చేతులకు మెహందీ, టెంపరరీ టాటూలు వేయించుకోకూడదు.
-పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు మొబైల్ ఫోన్లు, సెల్ఫోన్లు, ట్యాబ్లెట్లు, పెన్ డ్రైవ్‌లు, బ్లూటూత్ డివైజ్‌లు, రిస్ట్‌వాచ్‌లు, వాచ్ క్యాల్యుకులేటర్లు, వ్యాలెట్, విడి కాగితాలు వెంట తీసుకురాకపోవడమే ఉత్తమం. వీటిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించబడదని అధికారులు తెలిపారు.