కంది, జూలై 3 : సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాల్ గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫిల్మ్‌నగర్ ఎస్సై రాజేశ్వర్‌రావు దుర్మరణం చెందారు. బుధవారం హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద బందోబస్తు విధులు ముగించుకొన్న ఎస్సై తన కారులో స్వస్థలమైన సంగారెడ్డికి బయలుదేరారు.
ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి కారు చేర్యాల్ గేట్ వద్దకు చేరుకోగానే ముందున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్సైకి తీవ్ర గాయాలు కాగా, దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. 1990 బ్యాచ్‌కు చెందిన రాజేశ్వర్ వారం రోజుల క్రితమే హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.