నాంపల్లి క్రిమినల్ కోర్టులు, మార్చి 12 (నమస్తే తెలంగాణ ): సైబర్ క్రైమ్ ఎస్‌హెచ్‌వో, ఈ కేసుకు విచారణాధికారిగా ఉన్న ఎస్ నరేశ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ జీ అనూష సంచలన తీర్పు వెల్లడించారు. ఈ కేసు గురించి కోర్టుకు పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ’ఎప్పుడు అరెస్టు చేశారని కోర్టు ప్రశ్నించగా, ’తెల్లవారుజామున 40 మంది మగ పోలీసులు మఫ్టీలో బలవంతంగా ఇంట్లోకి చొరబడ్డారని పల్స్ న్యూస్ ఎండీ పీ రేవతి కోర్టుకు తెలిపారు. ’ కోర్టు ఎదుట చెప్పలేని బూతులు మాట్లాడుతూ మానసికంగా వేధించారని, తనఫోన్ ఇవ్వమని తిట్టారని తెలిపారు. ఇంటి బయట ఉన్న తన భర్తను చితకబాది ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను లాక్కొని వెళ్లారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
తనను పోలీస్‌స్టేషన్‌కు కాకుండా ఇతర ప్రాంతానికి తీసుకెళ్లి హింసించారని తెలిపారు. ’ ఏ కేసులో తనను అరెస్టు చేశారో తెలపమని అడిగినప్పటికీ సమాచారమివ్వకుండా వ్యాన్‌లో కూర్చోపెట్టి పలు ప్రాంతాలకు తీసుకెళ్లినట్టు తెలిపారు. అరెస్టు చేసినట్టు తన భర్తకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వాపోయారు. రెండో ముద్దాయిగా ఉన్న న్యూస్ రిపోర్టర్ బండి సంధ్య అలియాస్ తన్వీయాదవ్ను సైతం కోర్టు ప్రశ్నించగా, ’ తనను ఈడ్చి వాహనంలోకి పోలీసులు తోశారని, చేతికి తగిలిన గాయాలను చూపించి కోర్టుకు తెలిపారు. నిందితుల తరఫున న్యాయవాది కిరణ్‌కుమార్ కోర్టుకు వాదనలు వినిపించారు. సీఎంపై ఓ వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రసారం చేసినంత మాత్రాన ఎలా కేసు నమోదు చేస్తారని ప్రశ్నించారు. 111 సెక్షన్ ఈ కేసుకు వర్తించదని, రాజకీయ కక్షసాధింపు చర్యలో భాగంగానే వారిపై కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. దీనిపై పీపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి నిందితులిద్దరినీ రిమాండ్‌కు తరలించాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మహిళాజర్నలిస్టులను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
న్యాయవాది లలితారెడ్డితో సీఐ వాగ్వాదం
అరెస్టు సమాచారం తీసుకోవాలని విచారణాధికారి నరేశ్ ఒత్తిడి చేయగా, న్యాయవాది లలితారెడ్డి తిరస్కరించారు. ఉదయం నుంచి అరెస్టు చేసినట్టు సమాచారమివ్వకుండా ఇప్పుడెలా ఇస్తారని ఆమె ప్రశ్నించడంతో సీఐ వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత అరెస్టుపై ఇప్పుడే తమకు సమాచారమిచ్చారని న్యాయవాది లలితారెడ్డి కోర్టుకు తెలిపారు.