హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ప్రికాషన్ డోస్ పట్ల ప్రజలు విముఖత చూపుతున్నారు. ఇప్పటివరకు బూస్టర్ డోస్ పంపిణీ 20 శాతం దాటలేదు. తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితే ఉన్నది. రాష్ట్రంలోని అర్హుల్లో 20 శాతం మంది మాత్రమే మూడో డోస్ వేసుకున్నారు. ఓ వైపు కొవిడ్ ప్రభావం తగ్గడం.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఉచిత పంపిణీపై ఆలస్యం చేయడంతో ప్రజల్లో ఆసక్తి తగ్గిపోయిందని నిపుణులు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా 18 ఏండ్లు పైబడినవారిలో 91 కోట్ల మందికి మొదటి డోస్ వేశారు. 86 కోట్ల మందికి రెండో డోస్ పూర్తయింది. వీరంతా బూస్టర్ డోస్‌కు అర్హులు. కానీ ఇప్పటివరకు 16.15 కోట్ల మంది మాత్రమే మూడో డోస్ వేసుకున్నారు. కనీసం 20 శాతం కూడా దాటలేదు. దేశవ్యాప్తంగా సరిపడా టీకా నిల్వలు ఉన్నాయి. శుక్రవారం నాటికి అన్ని రాష్ర్టాల్లో కలిపి 5.47 కోట్ల టీకాలు నిల్వ ఉన్నాయి. అయినా ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో నెమ్మదిగా సాగుతున్నది.
ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధిక శాతం ఒమిక్రాన్ వేరియంట్‌వే. దీని ప్రభావం తక్కువగా ఉండటంతో ప్రజలు కొవిడ్‌ను పట్టించుకోవడం లేదు. బూస్టర్‌కు ఇది ప్రధాన అడ్డంకిగా మారింది. మరోవైపు.. ప్రజలు అడిగినప్పుడు ఉచితంగా బూస్టర్ డోస్ వేయకుండా, రాజకీయ ప్రయోజనం కోసం కేంద్రం కొన్నాళ్లపాటు ఊరించింది. దీంతో బూస్టర్ డోస్‌పై ప్రజల్లో ఆసక్తి పోయిందని నిపుణులు చెప్తున్నారు. రాష్ట్రంలో మంత్రి హరీశ్‌రావు సహా అధికారులంతా సందర్భం వచ్చినప్పుడల్లా బూస్టర్ డోస్ వేసుకోవాలని సూచిస్తూనే ఉన్నారు. కేంద్రం ఈ ప్రచారానికి మరింత బూస్ట్ ఇస్తే అర్హులందరూ మూడో టీకా వేసుకుంటారని అధికారులు చెప్తున్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 3.23 కోట్ల మందికి మొదటి డోస్, 3.12 కోట్ల మందికి రెండో డోస్ వేశారు. మూడో డోస్ ఇప్పటివరకు 58 లక్షల మందికి మాత్రమే వేయగలిగారు. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 2.6 కోట్ల మంది ప్రికాషన్ డోస్‌కు అర్హులుగా ఉన్నారు. వీరిలో దాదాపు 22 శాతం మంది బూస్టర్ వేసుకున్నారని గణాంకాలు చెప్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలో వేగంగానే టీకాల పంపిణీ జరుగుతున్నది. రోజుకు సుమారు 1.5 లక్షల మందికి బూస్టర్ వేస్తున్నారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 1.59 లక్షల మందికి టీకాలు వేస్తే.. ఇందులో 1.53 లక్షలు (96 శాతం) మూడో టీకాలే. రాష్ట్రంలోనూ 24 లక్షల టీకాలు అందుబాటులో ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ర్టాలైన యూపీలో 17 శాతం, మహారాష్ట్రలో 13 శాతం, కర్ణాటకలో 18 శాతం మాత్రమే ప్రికాషన్ డోస్ వేయగలిగారు.