Divorce | హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): భార్య వంట చేయలేదని చెప్పి భర్త విడాకులు కోరడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. భార్య వంట చేయకపోవడం క్రూరత్వం కిందికి రాదని తేల్చి చెప్పింది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు భార్య వంట చేసేందుకు ఆసారం ఉండకపోవచ్చునని పేర్కొంది. వంట చేయకుండా ఆమె తల్లికి సహకరించడం లేదంటూ భార్య క్రూరత్వానికి పాల్పడిందన్న భర్త వాదనను తోసిపుచ్చింది.
ఉద్యోగం చేస్తున్న భార్య వంట చేయడం లేదని, తల్లికి సహకరించడం లేదని, ఇది క్రూరత్వం కిందికి వస్తుందని చెప్పి భర్త విడాకులు కోరడాన్ని తప్పుపట్టింది. ఈ కారణాలతో వివాహాన్ని రద్దు చేయడం సాధ్యంకాదని తేల్చి చెప్పింది. భార్య రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగం చేస్తారని, ఆమె వంట చేయకపోవడం భర్తను హింసిస్తున్నట్టుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. అత్త వంట చేసేప్పుడు భార్య సహకరించకపోవడం హింసించడం కిందికి రాదని తీర్పులో పేరొంది.
భార్య వంట చేయడం లేదని, తన తల్లి వంట చేసేటప్పుడు భార్య సహకరించడం లేదని, ఇది క్రూరత్వం, హింసించడం కిందికి వస్తుందని, కాబట్టి తనకు విడాకులు మంజూరు చేయాలంటూ హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్కు చెందిన ఒక వ్యక్తి చేసిన అభ్యర్థనను కింది కోర్టు గతంలో కొట్టేసింది. సదరు భర్త కింది కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేశారు. దీనిని జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ నగేశ్ భీమపాకతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించి ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. భర్త దాఖలు చేసిన విడాకుల అప్పీల్ పిటిషన్ను కొట్టివేసింది.
భర్త మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 10 వరకు ఆఫీసు విధుల్లో ఉండగా, భార్య ఉదయం 9 నుంచి 6 గంటల వరకు ఉద్యోగం చేస్తున్నారని, ఈ పనివేళల నేపథ్యంలో ఉదయం వేళ భార్య వంట చేయడం ఎలా సాధ్యమని కోర్టు ప్రశ్నించింది. భార్య ఉదయం వంట చేయలేదన్న కారణాన్ని క్రూరత్వంగా పరిగణించలేమని తేల్చి చెప్పింది. తన తల్లి వంట చేస్తుంటే భార్య సహకరించడంలేదని, తానే తల్లి చేసే వంటకు సహకరిస్తున్నట్లు భర్త చెప్తూ.. కోడలు సహకరించకపోవడాన్ని అత్తను హింసినట్టుగా పరిగణించలేమని స్పష్టంచేసింది.
భార్య తరచూ పుట్టింటికి వెళ్తున్నదని, పెండ్లి జరిగిన 20 మాసాల్లో కేవలం 5 నెలలే తనతో ఉందని ఒకసారి మూడు నెలలే ఉందని మరోసారి భర్త పరస్పర విరుద్ధంగా చెప్పడాన్ని తప్పుపట్టింది. భార్య తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త అరెస్టయితే అది ఆమె వల్ల జరిగిందని ఎలా చెప్తారని ప్రశ్నించింది. తల్లిదండ్రుల నుంచి విడిగా కాపురం పెట్టాలని భార్యాభర్తల్లో ఎవరు కోరినా అది హింస/క్రూరత్వం కిందికి వస్తుందన్న సుప్రీంకోర్టు తీర్పు ఈ కేసుకు వర్తించదని తెలిపింది. భార్య ఆ విధంగా వేరుకాపురం పెట్టాలని కోరలేదని గుర్తుచేసింది. జీవితంలో అభిప్రాయబేధాలు, చిన్నపాటి గొడవలు వస్తుంటాయని, వాటిని భూతద్దంలో చూసి కుటుంబాలు విడిపోవాలని కోరడం సరికాదని హితవు చెప్పింది. భర్త చెప్తున్న కారణాలతో విడాకులు మంజూరు చేయలేమని తెలిపింది.